వ్యక్తిత్వమే కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది

వ్యక్తిత్వమే కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది
సత్యం జయిస్తుంది ... ధర్మం రక్షిస్తుందని ఈ లోకానికి చాటిచెప్పిన మహానుభావుడు హరిశ్చంద్రుడు. అందుకే సత్యధర్మాల గురించిన చర్చ ఆయన పేరు ప్రస్తావించకుండా ముగియదు. అంతలా ఆయన సత్యాన్ని ఒక వ్రతంలా ... ధర్మాన్ని ఒక దీక్షలా ఆచరించాడు. ఈ విషయంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా చలించకుండా ఆయన ముందుకు సాగాడు ... అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.

అయోధ్యను పరిపాలిస్తోన్న హరిశ్చంద్రుడు, తన ప్రజలను క్రూరమృగాల బారి నుంచి కాపాడటం కోసం అడవికి వెళతాడు. ఆయనని సత్యధర్మాల నుంచి తప్పించడానికి అదే మంచి అవకాశంగా విశ్వామిత్రుడు భావిస్తాడు. తన తపో శక్తితో ఇద్దరు కన్యలను సృష్టించి, హరిశ్చంద్రుడిని వివాహం చేసుకోవలసిందిగా ఆదేశిస్తాడు.

అడవిలో విశ్రాంతి తీసుకుంటోన్న హరిశ్చంద్రుడిని వాళ్లిద్దరూ కలుసుకుని, తమని వివాహం చేసుకోవలసిందిగా కోరతారు. వాళ్ల ధోరణి పట్ల ఆయన తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ వుండగా, పథకంలో భాగంగానే విశ్వామిత్రుడు అక్కడికి వస్తాడు. తన కుమార్తెల కోరికను మన్నించకుండా వాళ్ల మనసుకి కష్టం కలిగించడం పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఈ విషయంలో తనని సంతృప్తి పరచాలనుకుంటే, తన కుమార్తెలను వివాహమాడటం మినహా మరో మార్గం లేదని చెబుతాడు.

అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య వుండగా, తాను మరో వివాహం చేసుకోలేనని చెబుతాడు హరిశ్చంద్రుడు. అవసరమైతే తన రాజ్యాన్నైనా వదులుకుంటాను గానీ, ధర్మాన్ని మాత్రం తప్పనని తేల్చి చెబుతాడు. అయితే ఆ మాటపై నిలబడమని అంటాడు విశ్వామిత్రుడు. దాంతో ఆయనని సభా మందిరానికి ఆహ్వానించి, రాజ్యాన్ని ఆయనకి ధారపోసి కట్టిబట్టలతో భార్యాబిడ్డలను తీసుకుని హరిశ్చంద్రుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందుకే లోకంలో సత్య ధర్మాల ప్రస్తావన వచ్చిన ప్రతి చోటా హరిశ్చంద్రుడి పేరు వినిపిస్తూనే వుంటుంది. మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వం మంచి మనసుల్లో ఆవిష్కరించబడుతూనే వుంటుంది.

More Bhakti Articles