పాపానికి ఫలితం అనుభవించవలసిందే !

పాపానికి ఫలితం అనుభవించవలసిందే !
ఆశ్రమజీవితాన్ని గడుపుతూ .. కృష్ణనామ సంకీర్తనను కొనసాగిస్తూ వుంటాడు జయదేవుడు. ఆ సమయంలోనే గురువు ఆదేశానుసారం ఆయన పద్మావతి అనే యువతిని వివాహం చేసుకుంటాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, స్నేహితుడి ఆశ్రయాన్ని పొందుతాడు. ఇక్కడే వాళ్లు కష్టతరమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది.

జయదేవుడు - పద్మావతిల వివాహం సమాజం హర్షించేది కాదని ఆ గ్రామపెద్ద ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ దంపతులు వెంటనే గ్రామం విడిచి వెళ్లాలని అంటాడు. ఆ దంపతులకు ఆశ్రయం కల్పించిన స్నేహితుడిని కూడా ఆయన హెచ్చరిస్తాడు. జయదేవుడు వంటి మహాభక్తుడు ... కవి తన ఇంట్లో ఉండటం తన అదృష్టమని అతని స్నేహితుడు అంటాడు. వాళ్లు తన ఇంట్లోనే ఉంటారని తేల్చి చెబుతాడు.

దాంతో మంచి నీళ్లతో సహా మరేది వాళ్లకి దక్కకుండా వెలివేస్తూ ఆ గ్రామపెద్ద తీర్పు చెబుతాడు. ఫలితంగా తాగడానికి గానీ ... పూజాభిషేకాలకు గాని నీళ్లు లభించక జయదేవుడు వాళ్లు అలమటించిపోతుంటారు. తాము తాగడానికి నీళ్లు లేకపోయినా ఫరవాలేదు ... పూజాభిషేకలకు నీళ్లు ఇవ్వమని ఆ దంపతులు ఎంతగా కోరినా ఆ గ్రామపెద్ద వినిపించుకోడు.

అంతే ... ఎన్ని బిందెల నీళ్లు కుమ్మరించినా తగ్గని దేహతాపం ఆయనలో మొదలవుతుంది. ఆ బాధను బయటికి చెప్పుకోలేక ... ఉపశమనం పొందే మార్గం లేక ఆయన నానాఅవస్థలు పడసాగాడు. తాను చేసిన తప్పేమిటో గ్రహించిన ఆయన, జయదేవుడి విషయంలో తను ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటిస్తాడు. జయదేవుడి పాదాలపై పడి తనని మన్నించమని కోరతాడు. జయదేవుడి స్పర్శతో ఆయనకి ఉపశమనం లభిస్తుంది.

సాధు జీవులను దూషించడం ... వాళ్లు భగవంతుడికి చేస్తోన్న సేవలకు ఆటంకాన్ని కలిగించడం మంచిదికాదని అంటాడు జయదేవుడు. అందరినీ పాలించేది ఆ పరమాత్ముడేనని గ్రహించి అహంకారం వీడమని హితవు చెబుతాడు. ఈ సంఘటనతో అసమానమైన ఆయన భక్తిని గురించి అందరికీ తెలిసిపోతుంది. ఆయన కావ్య రచన ప్రశాంతంగా కొనసాగడానికి దోహదపడుతుంది.

More Bhakti Articles