స్వామివారి సన్నిధిలోని వెన్న కరగదట !

స్వామివారి సన్నిధిలోని వెన్న కరగదట !
తిరువనంతపురం పేరు వినగానే ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'అనంతపద్మనాభ స్వామి' ఆలయం కనులముందు కదలాడుతుంది. ఎన్నో విశేషాలకు ... మరెన్నో ప్రత్యేకతలకు నిలయంగా ఈ ఆలయం కనిపిస్తూ వుంటుంది. స్థల మహాత్మ్యం ... చారిత్రక వైభవం ... పుష్కరిణి విశిష్టత ... స్వామివారి మహిమలు సుదూర ప్రాంతాల నుంచి భక్తులను ఇక్కడికి రప్పిస్తూ వుంటాయి.

ఇక్కడ అడుగుపెడితే ఒక ఆలయానికి వచ్చినట్టుగా కాకుండా, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. ఆశ్చర్యచకితులను చేసే ఇక్కడి విశేషాలలో, వెన్నను నైవేద్యంగా స్వీకరించే హనుమంతుడు కనిపిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో గల ఈ హనుమంతుడు మహిమాన్వితుడని చెబుతుంటారు.

సాధారణంగా హనుమంతుడికి ఇష్టమైనవిగా చెప్పబడుతోన్న వడలను ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మరొకొన్ని ఆలయాల్లో వడపప్పు - బెల్లం నైవేద్యం పెడుతుంటారు. అందుకు పూర్తి భిన్నంగా ఇక్కడి స్వామికి 'వెన్న' ను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే ఈ వెన్న కరగకపోవడం ... దానికి చీమలు పట్టకపోవడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

నిజానికి కొంచెం సెగ తగిలినా ... ఎండ తగిలినా వెంటనే వెన్న కరిగిపోతూ వుంటుంది. అలాంటి వెన్నను చీమల బారి నుంచి కాపాడుకోవడం కూడా కష్టమే. ఎంత ఎండగా వున్నా ఇక్కడ వెన్న కరగకపోవడం ... దానికి చీమలు పట్టకపోవడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. ఇలా అనేక విశేషాలకు ఆలవాలమైన ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిందే ... తరించవలసిందే.

More Bhakti Articles