నెమలితో పాటు కోడిపుంజుకీ విశిష్ట స్థానం !

నెమలితో పాటు కోడిపుంజుకీ విశిష్ట స్థానం !
కుమారస్వామి అనగానే శక్తి ఆయుధాన్ని ధరించిన అందమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. అసుర సంహారమే లక్ష్యంగా అవతరించిన కుమారస్వామి, దేవతల సైన్యాధిపతిగా కీలకమైన పాత్రను పోషించాడు. దేవ లోకానికి ముప్పు తలపెట్టిన అసురులను, సాధు సత్పురుషులను హింసిస్తోన్న అసురులను ఎప్పటికప్పుడు అంతమొందిస్తూ లోక కల్యాణానికి గాను తనవంతు పాత్రను పోషిస్తూ వచ్చాడు.

అంతటి పరాక్రమశాలి అయిన కుమారస్వామి వాహనంగా 'నెమలి' దర్శనమిస్తూ వుంటుంది. ఇక ఆయన రథంపై గల జెండాపై 'కోడిపుంజు' ముద్ర కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే కుమారస్వామిని 'కుక్కుట ధ్వజుడు' గా కొలుస్తుంటారు. స్వామివారి వాహనంగా నెమలి ... ఆయన ధ్వజంగా కోడిపుంజు ఎంపిక కావడం వెనుక ఆసక్తికరమైన కథనమే కనిపిస్తుంది.

తారకాసురుడిని కుమారస్వామి సంహరించడం పట్ల సాధు జనులు ... దేవతలు హర్షాన్ని ప్రకటిస్తారు. తారకాసురుడి మరణవార్త విన్న అతని సోదరుడు 'శూరపద్ముడు', ఆగ్రహావేశాలతో రగిలిపోతాడు. కుమారస్వామిని అంతమొందించాలనే ఉద్దేశంతో, తన సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు. కుమారస్వామితో మాయా యుద్ధం చేస్తూ అందులో భాగంగా మామిడి చెట్టులా మారిపోతాడు.

దాంతో కుమారస్వామి తన శక్తి ఆయిధంతో ఆ చెట్టును రెండు భాగాలుగా చీలుస్తాడు. అలా శూరపద్ముడి శరీరం రెండు భాగాలు చేయబడుతుంది. అందులో ఒక భాగం నెమలి రూపాన్ని పొందగా, మరోభాగం కోడిపుంజు రూపాన్నిసంతరించుకుంటుంది. అప్పుడు స్వామి నెమలిని తన వాహనంగా, కోడిపుంజును ధ్వజంగా చేసుకున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలనాటి ఆ సంఘటనకు వేదికగా నిలిచిన 'తిరుచెందూరు' క్షేత్రం, ఈనాటికీ తన విశిష్టతను చాటుకుంటూనే వుంటుంది.

More Bhakti Articles