అమ్మవారికి ఎందుకు ఆగ్రహం కలుగుతుంది ?

అమ్మవారికి ఎందుకు ఆగ్రహం కలుగుతుంది ?
జీవితం అనేక సంఘటనలు ... అనుభవాలు ... అనుభూతుల కలయికగా కనిపిస్తూ వుంటుంది. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఇతరులతో తమ అనుభవాలను ... అభిప్రాయాలను ... అనుభూతులను పంచుకోవలసి వస్తుంది. మనసులోని ఈ విషయాలను ఇతరులకు చేరవేయగలిగేది 'మాట' మాత్రమే. ఆనందాన్నీ ... విచారాన్ని వ్యక్తం చేయాలన్నా, ఇతరులకు ధైర్యాన్ని ... ఓదార్పును ఇవ్వాలన్నా 'మాట'కు మించిన మార్గం లేదు. మనసులోని భావాలను చుట్టూవున్న ప్రపంచంతో పంచుకోవడానికి మాటను మించిన ఆయుధం లేదు.

సాధారణంగా కొంతసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తేనే మహా కష్టమైపోతుంది. అలాంటిది మాట్లాడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనంతమైన భావజాలాన్ని అవలీలగా ఆవిష్కరించే 'మాట' ... ఆ సరస్వతీదేవి అనుగ్రహంగా చెప్పవచ్చు. అందుకే ఆ తల్లిని 'వాగ్దేవి' గా ఆరాధిస్తూ వుంటారు. ఈ సృష్టిలో మాట్లాడే శక్తి మనిషికి తప్ప మరే జీవికి లేదు. ఇంతటి అరుదైన వరాన్ని ఆమె కేవలం మానవజాతికి మాత్రమే ప్రసాదించింది.

అలాంటి వరాన్ని అపురూపంగా ... అపూర్వంగా చూసుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై వుంది. వాక్కు అనే ఈ శక్తి అత్యంత పవిత్రమైనదిగా భావించాలి. అప్పుడే తాను ఇచ్చిన వరానికి సార్ధకత లభించినట్టుగా అమ్మవారు ఆనందిస్తుంది. మాట్లాడే ప్రతి మాట సున్నితంగా ... సౌమ్యంగా ఉండాలి. మంచినే మాట్లాడాలి ... మంచి కోసమే మాట్లాడాలి. అప్పుడే అమ్మవారు వాళ్లకి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది.

ఇక అమ్మవారు ఇచ్చిన వరాన్ని అసత్యాలు చెప్పడానికీ ... ఇతరులను దూషించడానికి ఉపయోగించేవాళ్లు కొందరుంటారు. దైవాన్నీ ... భక్తులను ... సాధు జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని విమర్శించేవాళ్లు మరికొందరుంటారు. ఇలాంటివారి ధోరణి అమ్మవారికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. మాటల ద్వారా అపచారాలు ... అపరాథాలు చేసే వాళ్లను పతనం దిశగా పరుగులు తీయిస్తుంది.

More Bhakti Articles