నాగ సర్పం దేవతగా మారిన ప్రదేశం !

నాగ సర్పం దేవతగా మారిన ప్రదేశం !
అడవిలాంటి ప్రదేశాలలోనూ ... కొండ ప్రాంతాలలోను ... పొలాల్లోను విషసర్పాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. వాటికి ఆహారం లభించే ప్రదేశాలు కావడం వలన అవి అక్కడ ఎక్కువగా తిరుగుతూ వుంటాయి. ఈ సమయంలోనే అవి మనుషుల కంట పడుతుంటాయి. వాటి వలన ప్రాణహాని ఉండటం వలన వాళ్లు వెంటబడి చంపేస్తూ వుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ కనిపిస్తూనే వుంటాయి.

పామును చంపగానే అది నిర్జీవంగా మారిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా పామును చంపగానే అది దేవతా రూపాన్ని పొంది, తనకి శాపవిమోచనం అయిందని చెబితే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆ సమయంలో అక్కడలేని వాళ్లు దీనిని ఒక జానపద కథలా మాత్రమే వింటారుగాని నమ్మరు.

అయితే మహిమాన్వితమైన ఈ సంఘటన కృష్ణా జిల్లా నందివాడ మండలంలో గల 'రుద్రపాక'లో నిజంగానే జరిగిందని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ నిర్మించిన 'శ్రీ వల్లీదేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యస్వామి' ఆలయాన్ని చూపిస్తుంటారు. పూర్వం ఈ ప్రదేశంలో ఒక రైతు పొలం వుండేదట. ఒకసారి ఆయనకి ఇక్కడ నాగుపాము కనిపించగానే, తన మనుషులతో దానిని కొట్టించాడు.

పాము ప్రాణం పోగానే అక్కడ ఛాయామాత్రంగా ఒక దేవతా రూపం ప్రత్యక్షమై, తనకి శాపవిమోచనం కలిగిందని చెప్పిందట. అయితే సర్పరూపంలో వున్న తనని చంపిన పాపం పోవాలంటే, ఆ ప్రదేశంలో నాగ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని నిర్మించమని చెప్పి అదృశ్యమైంది. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం నిర్మించడం ... అది భక్తుల పాలిట కల్పతరువై విలసిల్లుతూ వుండటం జరుగుతోంది.

More Bhakti Articles