మంత్రాలను సరిగ్గా చదవకపోతే ?

మంత్రాలను సరిగ్గా చదవకపోతే ?
భగవంతుడి నామాలను ... స్తోత్రాలను అక్షరదోషాలు లేకుండా చదవాలని శాస్త్రం చెబుతోంది. పారాయణాలు ... భజనలు చేసేటప్పుడు, కీర్తనలు ఆలపించేటప్పుడు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భగవంతుడి అనుగ్రహాన్ని త్వరగా కలిగించే మంత్రాల విషయానికి వస్తే, ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఈ విషయంలో పండితులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవడం మరింత మంచిది.

ఎలా చదివినా భగవంతుడు ఏమీ అనుకోడు అనే వైఖరితో ముందుకు వెళ్లకూడదు. మంత్రానికి దేవతలు అధీనులై ఉంటారని చెప్పబడుతోంది. అందువలన మంత్రాన్ని లయబద్ధంగా ... స్పష్టంగా ... ఉచ్చారణ దోషాలు లేకుండా పలకాలని అంటారు. మంత్రాన్ని సరిగ్గా పలకక పోవడం వలన దాని అర్థం మారిపోతుంది ... ఆ దోషం కారణంగా అనర్థం జరిగిపోతుంది. ఇందుకు ఉదాహరణగా 'వృత్రాసురుడు' జీవితంలో జరిగిన ఒక సంఘటన కనిపిస్తుంది.

అమరాలోకాధిపతి అయిన దేవేంద్రుడిపై దాడి చేసి, ఆయనపై విజయాన్ని సాధించాలని వృత్రాసురుడు నిర్ణయించుకుంటాడు. అందుకు పరిస్థితులు అనుకూలించడం కోసం ఒక యాగాన్ని తలపెడతాడు. ఆ యాగాన్ని చేయడానికి వేద పండితులైన బ్రాహ్మణులు నిరాకరించడంతో, ఆయనలో పట్టుదల మరింత పెరిగిపోతుంది. సరిగ్గా మంత్రం పలకలేని వారితో ఆ యాగాన్ని ఆయన పూర్తిచేస్తాడు. వాళ్లు మంత్రం సరిగ్గా చదవకపోవడం వలన అర్థం మారిపోతుంది.

దేవేంద్రుడి కన్నా వృత్రాసురుడి శక్తిసామర్థ్యాలు రెట్టింపు కావాలనే అర్థం మారిపోయి, వృత్రాసురుడి కన్నా దేవేంద్రుడి శక్తిసామర్థ్యాలు రెట్టింపు కావాలనే అర్థం వస్తుంది. ఈ పొరపాటుని గమనించని వృత్రాసురుడు, యాగం పూర్తికాగానే దేవేంద్రుడిపై యుద్ధానికి దిగుతాడు. మంత్ర ప్రభావం కారణంగా దేవేంద్రుడి చేతిలో పరాజయం పాలవుతాడు. అందువలన భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలను పఠించేటప్పుడు ... మంత్రాలను చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు కలగకుండా చూసుకోవాలి.

More Bhakti Articles