అందమైన లోయలో ఆవిర్భవించిన అమ్మవారు

అందమైన లోయలో ఆవిర్భవించిన అమ్మవారు
ఆది నుంచి కూడా దేవతలకు ... రాక్షసులకు మధ్య ఆధిపత్యపోరు నడుస్తూ వుండేది. వివిధ కాలాల్లో అనేక మంది అసురులు దేవలోకంపై దాడిచేసి వాళ్లను భయబ్రాంతులను చేసే వాళ్లు. అలాంటి అసురులలో మహిషాసురుడి పేరు ముందువరుసలో కనిపిస్తుంది. స్వర్గలోక ఆధిపత్యం కోసం మహిషాసురుడు దేవతలను నానాఇబ్బందులు పెట్టసాగాడు. దేవతలను కొలిచే మానవులను ... సాధు సత్పురుషులను హింసించసాగాడు.

మహిషాసురుడి ఆగడాలను భరించలేకపోయిన ఇంద్రాది దేవతలు, త్రిమూర్తుల సన్నిధిలో తమ ఆందోళనను వ్యక్తం చేస్తారు. దాంతో ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ద్వారా అసుర సంహారం జరిగితే బాగుంటుందనే నిర్ణయానికి వస్తారు. వారి సూచన మేరకు అమ్మవారు మహిషాసురుడిని ఈ ప్రదేశంలో సంహరించింది. మహర్షుల అభ్యర్థన కోరికపై ఇక్కడే మహిషాసురమర్ధినిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ - 'జుబ్బల్' సమీపంలో గల 'హట్ కోటి' లోయలో దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారిని 'హట్కేశ్వరీదేవి' పేరుతో కొలుస్తుంటారు. ఆలయ నిర్మాణం ఇక్కడి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ చిత్రంగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో అష్ట లోహాలతో రూపుదిద్దుకున్న అమ్మవారి మూర్తి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. అమ్మవారు ఒక్కోసారి నవ్వుతున్నట్టుగా ... ఒక్కోసారి కోపంగా ఉన్నట్టుగా కనిపించడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

వివిధ రకాల ఆయుధాలను ధరించి అష్ట భుజాలతో అమ్మవారు దర్శనమిస్తూ వుండగా, ఆమె పాదాల కింద మహిషాసురుడు నలిగిపోతూ కనిపిస్తుంటాడు. లోక కల్యాణ కారకమైన ఆ ఘట్టాన్ని దేవతలంతా ప్రత్యక్షంగా తిలకిస్తున్నట్టుగా ... ఆమెను కీర్తిస్తున్నట్టుగా గర్భాలయ దృశ్యం వుంటుంది. ఆ పక్కనే గల ప్రత్యేక మందిరంలో భారీ శివలింగం దర్శనమిస్తూ వుంటుంది. లోయలో నిర్మించబడిన ఈ ఆలయం ... సరస్సులో విరిసిన కలువలా అందంగా అద్భుతంగా దర్శనమిస్తూ వుంటుంది.

ఏప్రిల్ మాసం నుంచి అక్టోబర్ వరకూ ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ క్షేత్రంలో వివాహం చేసుకోవడం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అమ్మవారినీ ... స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. వారి అనుగ్రహం పొందిన వాళ్లు తమ స్థాయికి తగిన విధంగా కానుకలను సమర్పించుకుంటూ వుంటారు.

More Bhakti Articles