మనసులో నిలిచిపోయే వృద్ధమల్లికార్జునుడు

మనసులో నిలిచిపోయే వృద్ధమల్లికార్జునుడు
పరమశివుడు ప్రత్యక్షంగా కొలువైన మరో కైలాసమే శ్రీశైలం. ఎందరో మహర్షులకు ఆ మహాదేవుడి సాక్షాత్కారాన్ని కలిగించిన తపోభూమి ఇది. ఎంతోమంది సిద్ధులకు ఆ స్వామి అనుగ్రహం దక్కేలా చేసిన మహిమాన్వితమైన ప్రదేశం ఇది. స్వామివారి ఎడబాటును తట్టుకోలేని దేవతలు ... మహర్షులు ఇక్కడే అదృశ్య రూపంలో తిరుగాడుతుంటారు. వివిధ రూపాలను సంతరించుకుని ప్రకృతిలో ఓ భాగంగా కలిసిపోతుంటారు.

ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రంలో ఆదిదేవుడు .. మల్లికార్జునుడుగా, అమ్మవారు భ్రమరాంబికగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. ఇక్కడి కొండజాతి ప్రజలు భ్రమరాంబికా దేవిని కూతురుగా ... మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించేవాళ్లు. అందుకు తగిన ఆచారవ్యవహారాలతోనే తమ పూజా విధానాన్ని కొనసాగించేవాళ్లు. అడవిలో లభించే వివిధ రకాల ఫలాలను ... పుట్టతేనెను స్వామివారికి .. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేవాళ్లు.

ప్రేమానురాగాలతో వారి పూజలు అందుకున్న వాడిగా ఇక్కడి 'వృద్ధమల్లికార్జున స్వామి' దర్శనమిస్తూ వుంటాడు. ఆలయ ప్రాంగణంలో గల ఉపాలయంలోనే వృద్ధమల్లికార్జునస్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. రాయితో నున్నగా చేయబడిన శివలింగంలా కాకుండా, ప్రాచీన కాలానికి చెందిన 'చెట్టుమాను' ఆకృతిలో ఇది కనిపిస్తూ వుంటుంది. సహజసిద్ధంగా రూపుదాల్చిన ఈ శివలింగాన్ని చూడగానే మహిమాన్వితమైనదిగా అనిపిస్తుంది. ఈ వృద్ధమల్లికార్జునస్వామికి కూడా కొండజాతి ప్రజలు తమ మనసులో స్థానాన్ని కల్పించారు.

ఉపాలయంలో ఉన్నప్పటికీ ఈ వృద్ధమల్లికార్జునస్వామి తన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంటాడు. శ్రీశైలం వెళ్లిన భక్తులు తప్పక ఈ స్వామిని దర్శిస్తారు. వరాలను ప్రసాదించే 'వనదేవుడు'గా ఆయనను పూజిస్తూ పునీతులు అవుతుంటారు. ఈ క్షేత్రంతో ... ఇక్కడి స్వామివారితో కొండజాతి ప్రజల జీవితం పెనవేసుకుపోయి కనిపిస్తుంది. నేటికీ స్వామివారి ఉత్సవాల సందర్భంలో వీరికి ప్రత్యేకస్థానం ఇవ్వబడుతుంది. స్వామివారి రథాన్ని వీళ్లు లాగడమనేది ఒక ఆచారంగా తరతరాలుగా వస్తోంది. కొండదేవరతో కొండజాతి ప్రజలకు గల అనుబంధానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

More Bhakti Articles