వాసలక్ష్మిగా పూజలందుకునే లక్ష్మీదేవి

వాసలక్ష్మిగా పూజలందుకునే లక్ష్మీదేవి
శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన అనేక క్షేత్రాలు ఆయన లీలావిశేషాలకు నిలయంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆయన కొలువైన ప్రతి క్షేత్రం వెనుక పురాణపరమైన కథనం ఆసక్తికరంగా వినిపిస్తూనే వుంటుంది. ఆయన తన భక్తులను అనుగ్రహించిన సంఘటనలు మనోహర దృశ్యాలుగా కనులముందు కదలాడుతూనే వుంటాయి. అలాంటి అనిర్వచనీయమైన అనుభూతిని అందించే క్షేత్రంగా 'ఉరైయూర్' దర్శనమిస్తుంది.

తమిళనాడు - తిరుచ్చికి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కావేరి నది స్పర్శచే పరమపవిత్రమైన ఈ క్షేత్రంలో స్వామివారు 'దివ్యసుందరమూర్తి' పేరుతోను ... అమ్మవారు 'వాసలక్ష్మి' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ధర్మవర్మ అనే రాజుకు స్వామివారు ఇక్కడ ప్రత్యక్షదర్శనం ఇచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఈ ధర్మవర్మ ఏలుబడిలోనే ఈ ప్రాంతం నివాసయోగ్యంగా రూపుదిద్దుకోగా, సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన కుమార్తెగా జన్మించిందట. 'వాసలక్ష్మి' పేరుతో పెరిగి పెద్దయిన అమ్మవారు శ్రీరంగనాథుడిని పరిణమాడింది. ఇందుకు నిదర్శనంగానే శ్రీరంగంలో జరుగు బ్రహ్మోత్సవాల సమయంలో మూడవరోజున స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికి తరలివస్తారు ... వాసలక్ష్మీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తాడు.

పూర్వం ఈ ప్రదేశంలో ఒక కోడి .. ఏనుగును ఎదిరించడం జరిగిందట. అందువలన ఇది అత్యంత శక్తిమంతమైన ప్రదేశంగా ... విజయాలకు వేదికగా రాజులు భావించడం జరిగిందని అంటారు. ఈ సంఘటన కారణంగానే ఈ ప్రదేశాన్ని 'కోళియూర్' అని కూడా పిలుస్తుంటారు. ఆలయ నిర్మాణం ఆనాటి వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది. చోళరాజుల కాలంలో ఈ క్షేత్రం వైభవంగా వెలుగొందగా ... ఆ తరువాత వచ్చిన రాజులు ఆలయ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేశారు.

ముక్కోటి దేవతలకు ఇక్కడి స్వామివారు ప్రత్యక్ష దర్శనమిచ్చారట. ఎంతోమంది మహర్షులు స్వామిని ప్రత్యక్షంగా సేవించి తరించగా, మరెంతోమంది రాజులు ఈ స్వామిని ఇలవేల్పుగా భావించి విజయాలను ... కీర్తి ప్రతిష్ఠలను పొందారు. ఇక విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ ఘనంగా జరిగే ఉత్సవాల్లో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. అంగరంగవైభవంగా ఆయనని చూడాలనే ముచ్చట తీర్చుకుంటూ వుంటారు.

More Bhakti Articles