తేనెటీగల రూపంలో రుషులు పూజించిన క్షేత్రం

తేనెటీగల రూపంలో రుషులు పూజించిన క్షేత్రం
పుణ్యక్షేత్రాలు చాలావరకూ ప్రకృతిమాత ఒడిలో కొలువుదీరినట్టుగా కనిపిస్తుంటాయి. అలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ తేనెటీగలు కూడా కనిపిస్తుంటాయి. వనాలు ... అడవుల వంటి ప్రదేశాల్లో అవి కనిపించడం సహజమేనని అనిపిస్తుంది. అయితే అక్కడగల తేనెటీగలు మహర్షుల రూపాలని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రంగా 'తిరుక్కణ్ణమంగై' దర్శనమిస్తుంది.

తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రాన్ని 'కృష్ణమంగళ క్షేత్రం'గా కూడా పిలుస్తూ వుంటారు. స్వామివారు ఇక్కడ 'భక్తవత్సల పెరుమాళ్' పేరుతోను ... అమ్మవారు 'అభిషేకవల్లి తాయారు' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. పరమపవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ ప్రదేశం, నది ... నగరం ... తీర్థం ... క్షేత్రం ... రథం ... విమానం ... మంటపం అనే ఏడు విశిష్టతలను కలిగివున్న కారణంగా 'సప్తామృతక్షేత్రం'గా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి స్వామివారిని మహర్షులు తేనెటీగల రూపంలో సేవించారట. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ కూడా ఇక్కడ తేనెటీగల గూడు కనిపిస్తుంది. ఆ తేనెటీగల గూటికి కూడా 'తిరువారాధన' కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇక ఎంతో మంది రాజులు స్వామివారిని దర్శించుకుని తరించారు ... మరెంతో మంది భక్తులు స్వామివారిని కీర్తిస్తూ చరితార్థులయ్యారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి జరిగే ఉత్సవాలు ... వాహన సేవలు ఆలయ వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటాయి.

స్వామివారి ప్రత్యక్ష దర్శనం కోసం దేవతలు సైతం తరలి వచ్చిన క్షేత్రం ఇది. అలాంటి ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్కసారి అడుగుపెట్టడంతోనే సమస్తపాపాలు నశిస్తాయని చెప్పబడుతోంది. పౌరాణిక ... చారిత్రక నేపథ్యాలను కనువిందుగా ఆవిష్కరించే ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసితీరవలిందే.

More Bhakti Articles