ఈ వేళలో తలుపులు వేయకూడదా ?

ఈ వేళలో తలుపులు వేయకూడదా ?
సాధారణంగా పల్లెటూళ్లలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు ... రాత్రి వేళలో నిద్రపోవడానికి ముందు మాత్రమే తలుపులు వేసి కనిపిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ ఒకరిని ఒకరు గమనించడానికి అవకాశం వుంటుంది. అదే పట్నం విషయానికి వస్తే పొద్దస్తమానం తలుపులు వేసుకుని వుండే వాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు.

పట్నంలో ఇళ్లు మరీ దగ్గరికి ఉంటాయి కనుక, కాస్త స్వేచ్చగా ఉంటుందనే ఉద్దేశంతో తలుపులు ఎక్కువగా మూసి వుంచుతుంటారు. ఇక రక్షణ గురించి కూడా ఇదే పని చేస్తుంటారు. కారణమేదైనా సాయంకాలం దీపారాధన చేసే సమయంలో మాత్రం, తప్పని సరిగా ప్రధాన ద్వారం తలుపులు తెరచి ఉంచాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

నేటికాలంలో పూజ అంటే ఉదయం పూట మాత్రమే చేసేదని కొంతమంది భావిస్తుంటారు. ఈ కారణంగానే సాయంత్రం వేళలో పూజా మందిరాలలో దీపారాధన చేసే వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తూవుంటారు. మంత్రాలు ... పూజల విషయం అటుంచితే, ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందు ... సూర్యాస్తమయం తరువాత దీపారాధన చేయాలని శాస్త్రం స్పష్టం చేస్తోంది.

ఈ విధంగా చేయడం వలన సమస్తపాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. దీపం ... లక్ష్మీదేవి నివాసస్థానంగా చెప్పబడుతోంది. సాయంకాలం దీపారాధన చేయడమంటే, అమ్మవారిని ఆహ్వానించడం వంటిదే. తన భక్తులను అనుగ్రహించడానికి అమ్మవారు ఈ సమయంలోనే బయలుదేరుతుంది కనుక, ఆ సమయంలో ప్రధానద్వారం తలుపులు తెరచివుంచాలి.

ఈ సమయంలో బయట తలుపులు వేసి లోపల దీపారాధన చేయడం వలన ఎలాంటి ప్రయోజనం వుండదు. అలాగే బయట తలుపులు తీసి వుంచి, లోపల దీపారాధన చేయకపోవడం వలన కూడా ఎలాంటి లాభం వుండదని గ్రహించాలి. ఇక దీపారాధన చేసే తీరిక ... ఓపిక లేనివాళ్లు, సాయంత్రం సమయంలో విద్యుత్ దీపాలు వెలిగించడానికి ముందు ప్రధానద్వారం తలుపు తెరవడం మరచిపోకూడదు.

More Bhakti Articles