సదాశివుడిని సదా కనిపెట్టుకునే సర్పరాజం

సదాశివుడిని సదా కనిపెట్టుకునే సర్పరాజం
సదాశివుడి కంఠానికి సహజమైన ఆభరణంలా నాగరాజు కనిపిస్తూ వుంటాడు. పరమేశ్వరుడిని నిరంతరం స్పర్శిస్తూ ఉండే అదృష్టం ఆయనకి తప్ప మరెవరికి లభిస్తుందని అంతా అనుకుంటూ వుంటారు. స్వామివారు ఏ ప్రదేశంలో ఎక్కడ ఆవిర్భవించినా, నాగరాజు ఆయనని కనిపెట్టుకునే ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ కారణంగానే శైవ క్షేత్రాల్లో ఎక్కడ పాము కనిపించినా, దానిని నాగరాజుగానే భావిస్తుంటారు. ఆయన దర్శనభాగ్యం లభించినందుకు సంతోషంతో పొంగిపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని క్షేత్రాల్లో శైవ సంబంధిత పర్వదినాల్లో మాత్రమే నాగుపాములు కనిపిస్తూ వుంటాయి. అవి స్వామివారిని దర్శించుకున్నట్టుగా గర్భాలయం ముంగిట కొంతసేపు ఆగి వెళ్లిపోతూ వుంటాయి.

ఇక నేరుగా గర్భాలయంలోకి వెళ్లి శివలింగానికి సర్పాలు చుట్టుకునే ఆలయాలు కూడా లేకపోలేదు. భక్త జన సందోహం ఎంత వున్నా ఇలా నాగుపాములు రావడం ... వెళ్లడం, పైగా అవి ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఇక ఆలయప్రాంగణంలో .. గర్భాలయంలోనే కాదు, ఆలయ శిఖరంపై పడగవిప్పిన నాగుపాము కనిపిస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది ? అది మహిమాన్వితమైన క్షేత్రమనిపిస్తుంది.

అలాంటి క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని 'మార్కొంపాడు'లో కనిపిస్తుంది. మృకండ మహర్షి ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి శివుడు .. మార్కండేయస్వామిగా కొలవబడుతుంటాడు. పానవట్టంపై అమ్మవారి ప్రతిమ మలచబడి వుండటం ... ప్రతి కార్తీకపౌర్ణమి సందర్భంగా మూడురోజుల పాటు స్వామివారిపై సూర్య కిరణాలు ప్రసరించడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు.

ఇక ఇక్కడి ఆలయ శిఖరంపై, అంటే గర్భాలయ విమానంపై ఒక సర్పరాజం తరచూ కనిపిస్తూ ఉంటుందట. అప్పుడప్పుడు ఆ సర్పం బుసలు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో స్వామివారు ప్రత్యక్షంగా కొలువుదీరి ఉన్నాడనీ, అందువల్లనే ఆయనని నాగరాజు నిరంతరం కనిపెట్టుకుని ఉంటున్నాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles