ఇక్కడి బాబా కరుణా సముద్రుడు

ఇక్కడి బాబా కరుణా సముద్రుడు
శిరిడీ సాయిబాబా పేరు వినగానే ప్రేమ ... కరుణ నిండిన చూపులు గుర్తుకువస్తాయి. ఆలయంలోని ఆయన ప్రతిమను చూడగానే, నిరాడంబరంగా జీవించేవాళ్లు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తారనే విషయం బోధపడుతుంది. భక్తులను ఓ తండ్రిలా సంరక్షించడం ... వారి బాగోగులను ఓ తల్లిలా చూసుకోవడం బాబాకే చెల్లింది. తన కోసం కాకుండా తనని నమ్ముకున్న భక్తుల కోసమే చివరి నిమిషం వరకూ ఖర్చుచేసిన కారణంగానే బాబా అందరివాడయ్యాడు.

భక్తుల సంకల్పం మేరకు ఆయా ప్రాంతాల్లో కొలువై, వారికి నిత్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. అలా నిర్మించబడిన ఆలయాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం 'కన్నాపురం'లో కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించబడిన తొలి ఆలయంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. చాలాకాలం క్రితం నిర్మించిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతుంటుంది.

ఇక్కడి బాబాను చూడగానే చాలాకాలం తరువాత అమ్మను చూసిన అనుభూతి కలుగుతుంది. అనురాగం నిండిన ఆయన చూపులు హృదయాంతరాలను ఆప్యాయంగా తడుముతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి బాబా కరుణా సముద్రుడనీ ... కోరిన వరాలను వెంటనే అనుగ్రహిస్తాడని అంటారు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. సంతానం .. సౌభాగ్యం .. ఇలా ఎవరికి ఏది కావాలన్నా అనతికాలంలోనే ఆయన ప్రసాదిస్తాడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

శిరిడీలో మాదిరిగానే బాబాకి అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఇక బాబా దత్తాత్రేయస్వామి అవతారమే అయినప్పటికీ, ఈ ప్రాంగణంలో దత్తాత్రేయుడికి కూడా ప్రత్యేక మందిరం కనిపిస్తుంది. ప్రతి గురువారం ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. 'గురుపౌర్ణమి' ... 'దత్తజయంతి' వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... సేవలు జరుగుతుంటాయి.

More Bhakti Articles