బాబా చూపులు నిజాన్ని మాత్రమే చెప్పిస్తాయి

బాబా చూపులు నిజాన్ని మాత్రమే చెప్పిస్తాయి
శిరిడీలోని మశీదులో వుంటోన్న బాబాను అక్కడి ప్రజలు దైవాంశ సంభూతుడుగా భావించే వాళ్లు. అందువలన ఆయన దగ్గర ఏదైనా విషయాన్ని దాచడానికీ, అబద్ధం చెప్పడానికి అంతా భయపడేవాళ్లు. ఎవరైనా ఏదైనా తప్పుచేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, చేసిన తప్పును సమర్ధించుకోలేకపోయేవాళ్లు.

తప్పు చేసిన వాళ్లను బాబా చూపులు నిలువెల్లా దహించేవి ... దాంతో వాళ్లు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ బాబా పాదాలపై పడేవాళ్లు. ఇందుకు నిదర్శనంగా ఒక సంఘటన గురించి చెప్పుకోవచ్చు. ఒకసారి ఆంగ్లేయ ప్రభుత్వానికి చెందిన కొంతమంది న్యాయాధికారులు బాబా దగ్గరికి వస్తారు. తమతోపాటు తీసుకువచ్చిన వ్యక్తిని బాబాకు చూపిస్తారు. గంగారామ్ అనే ఆ వ్యక్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడనీ, కోర్టులో ప్రవేశపెట్టబడ్డానని చెబుతారు.

గంగారామ్ దగ్గర కొన్ని వస్తువులు కూడా లభించాయనీ ... అయితే అవి తాను దొంగించలేదనీ, తనకి అవి బాబా ఇచ్చాడని చెబుతున్నాడని అంటారు. ఈ విషయంలో నిజానిజాలు నిర్ధారించుకునేందుకు వచ్చామని చెబుతారు. నిజానికి ఆ గంగారామ్ ఎవరనేది బాబాకి తెలియదు. చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి అతను అబద్ధం చెబుతున్నాడనే విషయం బాబాకి అర్థమైపోతుంది. అతని దగ్గర గల వస్తువులను తానే ఇచ్చానని చెబుతున్నాడు కనుక, అది నిజమే కావొచ్చంటూ బాబా సమాధానమిస్తాడు.

ఆయనలా అనడంతో ఆంగ్లేయ అధికారులు గంగారామ్ ని వదిలివేయాలని నిర్ణయించుకుంటారు. తాను ఇంత చేసినా బాబా ఆగ్రహించకపోగా ... తనకి అనుకూలంగా మాట్లాడటంతో, చేసిన తప్పు గంగారామ్ ని మరింతగా దహించివేస్తుంది. దాంతో అతను మనసు మార్చుకుని ... తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తాడు. ఈ విషయంలో బాబా పేరును ప్రస్తావించినందుకు మన్నించమని ఆయన పాదాలపై పడతాడు.

More Bhakti Articles