రుక్మిణీని కృష్ణుడు అపహరించినది ఇక్కడేనట !

రుక్మిణీని కృష్ణుడు అపహరించినది ఇక్కడేనట !
'రుక్మిణీ కల్యాణం' చదవడం వలన ... వినడం వలన సకల శుభాలు కలుగుతాయని అంటారు. వివాహం ఆలస్యమవుతున్న వాళ్లు ... కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలను కునే వాళ్లు రుక్మిణీ కల్యాణం చదవాలని చెబుతుంటారు. రుక్మిణి .. శ్రీకృష్ణుడికి మనసివ్వడం, ఆయన విషయంలో తండ్రినీ ... సోదరుడిని ఎదిరించడం చేస్తుంది. రుక్మిణి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్లు ఆమెని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నిస్తారు.

ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు ఆలయానికి వచ్చిన ఆమెని అపహరించుకు వెళ్లి వివాహమాడతాడు. ద్వాపరయుగంలో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ కూడా ఆసక్తికరంగా ... ఆనందకరంగా అనిపిస్తూ వుంటుంది. గుంటూరు జిల్లా 'అమీనాబాద్'లో గల 'మూలాంకురేశ్వరీదేవి' ఆలయమే ఈ సంఘటనకు వేదికగా నిలిచిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. రుక్మిణీదేవి పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని ఇలవేల్పుగా ఆరాధించే వాళ్లట.

మూలాంకురేశ్వరీదేవి అనుగ్రహంతోనే రుక్మిణీదేవి వివాహం కృష్ణుడితో జరిగిందని చెబుతారు. తమని తరుముతూ వచ్చిన రుక్మిణీదేవి సోదరుడికి కృష్ణుడు తగిన బుద్ధి చెప్పిన ప్రదేశం కూడా ఇక్కడికి దగ్గరలో వుందని చూపుతుంటారు. సాధారణంగా దక్షిణ భారతంలో శ్రీరాముడితో ముడిపడిన క్షేత్రాలు కనిపిస్తాయిగానీ, శ్రీకృష్ణుడి సంబంధిత ఘట్టాలకు వేదికగా నిలిచే క్షేత్రాలు పెద్దగా కనిపించవు.

అలాంటిది ఇది ద్వాపరయుగం నాటి క్షేత్రంగా చెప్పబడుతూ వుండటం, రుక్మిణీ కళ్యాణ ఘట్టాలతో ఈ క్షేత్రం సరిపోలడం చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. రుక్మిణీదేవి అనునిత్యం అర్చించిన అమ్మవారు ... శ్రీకృష్ణుడు రథంపై వచ్చి ఆగిన ప్రదేశం ఈనాటికీ ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తూ వుంటాయి. ఆనాటి ఆనవాళ్లను అపురూపంగా కళ్ల ముందుంచే ఈ క్షేత్రం, మహిమాన్వితమైనదిగా మనసు దోచుకుంటోంది.

More Bhakti Articles