సర్వం శివమయంగా కనిపించే క్షేత్రం

సర్వం శివమయంగా కనిపించే క్షేత్రం
పరమశివుడు ప్రకృతి రమణీయతకు మురిసిపోయి ముగ్ధుడై వెలసిన క్షేత్రాలు కొన్నయితే, మహర్షుల తపస్సుకు మెచ్చి వారి అభ్యర్థన మేరకు ఆవిర్భవించిన క్షేత్రాలుగా మరికొన్ని కనిపిస్తాయి. అలాంటి ప్రాచీన క్షేత్రాలలో ఒకటిగా మనకి విశాఖపట్నంలోని 'అప్పికొండ' దర్శనమిస్తూ వుంటుంది. 'కపిలమహర్షి' ఆరాధనకు ఆనందించి శివుడు ఆయనకి ప్రసాదించిన ఆత్మలింగమే ప్రస్తుతం ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తోందని స్థలపురాణం చెబుతోంది.

ఆదిదేవుడి పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగిన కపిల మహర్షి ఈ ప్రదేశంలో నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించాడట. వాటిలో అయిదు శివలింగాలు మాత్రమే ప్రస్తుతం బయటికి కనిపిస్తూ వుంటాయి. మిగతావన్నీ కూడా కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయని చెబుతుంటారు. ఆ విధంగా ఇక్కడ భూమిపైనా .. కిందా కూడా శివలింగాలు ఉండటం వలన, ఇది అత్యంత శక్తిమంతమైన ... పవిత్రమైన భూమిగా భావిస్తుంటారు.

పురాణపరమైన నేపథ్యం గల ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకున్న చోళరాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆధారాలు వున్నాయి. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన పటిష్ఠమైన నిర్మాణం, చోళరాజుల అసమానమైన భక్తి విశ్వాసాలకు కొలమానంగా నిలుస్తూ వుంటుంది. సముద్ర తీరప్రాంతంలో వుండటం వలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. భక్తులు సముద్రస్నానం చేసి ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. గర్భాలయంలో గల 'సోమేశ్వరుడు'ని భక్తులు స్వయంగా అభిషేకించుకునే అవకాశం వుండటం ఇక్కడి ప్రత్యేకత.

ప్రతి సంవత్సరం 'మహాశివరాత్రి' సందర్భంగా ఇక్కడ ఘనంగా తీర్థం జరుగుతుంది. ఈ తీర్థంలో పాల్గొనడానికి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. సోమేశ్వరుడిని దర్శించుకోవడం వలన అనుకున్నవి అవలీలగా నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అంకితభావంతో ఆ స్వామిని పూజిస్తూ పునీతులు అవుతుంటారు.

More Bhakti Articles