జ్యేష్ఠ మాసం ప్రత్యేకత

జ్యేష్ఠ మాసం ప్రత్యేకత
చాంద్రమానం ప్రకారం చైత్ర .. వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు ... పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ ... పాపాలను పరిహరించుకోవడానికి ... దైవసేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి.

జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెలరోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పార్వతీదేవి ఆచరించిన 'రంభావ్రతం' ... వివాహిత స్త్రీలు ఆచరించే 'అరణ్యగౌరీ వ్రతం' ... గంగానది స్నానంతో పదిరకాల పాపాలను హరించే 'దశాపాపహర దశమి' ... 'త్రివిక్రమ ఏకాదశి' పేరుతో పిలవబడే 'నిర్జల ఏకాదశి'భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి. అలాగే సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' ... వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి.

ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' ... శ్రీమహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.అంతే కాదు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతోన్న 'యమునా నది పుష్కరాలు ఈ మాసంలో రానున్నాయి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను ... మరెన్నో విశేషాలను సంతరించుకుని, పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ వుంటుంది.

More Bhakti Articles