అగ్ని జ్వాలలు ఎవరిని సమీపించలేవు ?

అగ్ని జ్వాలలు ఎవరిని సమీపించలేవు ?
జ్ఞానదేవుడు బాల్యం నుంచి ఆ పాండురంగడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు. ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తూ ... ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. పరమాత్ముడి తత్త్వాన్ని అర్థం చేసుకుని ఆయనకి సమీపంగా జీవించమని చెబుతూ ఉండేవాడు. జ్ఞానదేవుడి బోధనలను అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తితో వింటూ ఆచరిస్తూ వుండేవాళ్లు.

జ్ఞానదేవుడు భక్తుడు మాత్రమే కాదనీ, దైవాంశ సంభూతుడని భావించేవాళ్లు. అందువలన ఆయన పట్ల ఎంతో మర్యాద పూర్వకంగా నడచుకునే వాళ్లు. జ్ఞానదేవుడి కీర్తిప్రతిష్ఠలను చూసి ఓర్వలేని కొందరు ఆయనకి వ్యతిరేక వర్గంగా తయారవుతారు. తమకి సాధ్యమైనంతగా వాళ్లు ఆయన గురించి ఇతరులతో చెడుగా చెప్పడం మొదలెడతారు. భక్తి పేరుతో ప్రజలను జ్ఞానదేవుడు తప్పుదోవ పట్టిస్తున్నాడనీ, ఆయనను ఊరు నుంచి తరిమేయాలని ప్రచారం చేయసాగారు.

ఈ విషయం చెవిన పడటంతో జ్ఞానదేవుడి మనసుకు కష్టం కలుగుతుంది. తాను చేస్తున్నది తన స్వార్థం కోసమే అయితే, అగ్నిదేవుడు తన ఆశ్రమంతో పాటు తమని కూడా దహిస్తాడని చెబుతాడు జ్ఞానేశ్వర్. అందరూ చూస్తుండగానే ఆయన తన సోదరులతో కలిసి ఆశ్రమంలోకి ప్రవేశించి, లోపలి నుంచి తలుపులు వేసి ఆశ్రమానికి నిప్పు పెడతాడు. ఊహించని ఈ సంఘటనకు ఆయన సేవకులతో పాటు వ్యతిరేకులు కూడా బిత్తరపోతారు.

జ్ఞానేశ్వర్ సేవకులు ఆ మంటల బారి నుంచి ఆయనని కాపాడాలనుకుంటారు గానీ, ఎగసి పడుతోన్న మంటల సమీపంలోకి వెళ్లలేకపోతారు. ఆశ్రమం పూర్తిగా కాలిపోతోందని అంతా అనుకుంటూ వుండగా, ఒక్కసారిగా మంటలన్నీ మాయమై ఎప్పటిలా ఆశ్రమం దర్శనమిస్తుంది. ఇది చూసిన వాళ్లంతా తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. లోపల జ్ఞానేశ్వర్ తో పాటు ఆయన సోదరుల పరిస్థితి ఎలా వుందో తెలుసుకోవడం కోసం ఆత్రంగా అడుగు ముందుకు వేయబోతుండగా, వాళ్లంతా ఎప్పటిలానే ప్రశాంత వదనాలతో బయటికి వస్తారు.

ఎలాంటి స్వార్థం లేకుండా ఆయన ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్నాడనే విషయం అందరికీ అర్థమైపోతుంది. జ్ఞానేశ్వర్ సేవకులతో పాటు ఆయన వ్యతిరేకులు సైతం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలపై పడతారు. మహాభక్తుడైన జ్ఞానేశ్వర్ ని అగ్నిజ్వాలలు తాకలేకపోయిన ఈ సంఘటన, ఆయన జీవిత చరిత్రలో స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. అసమానమైన ఆయన భక్తికి నిలువెత్తు నిదర్శనమై నిలుస్తూ వుంటుంది.

More Bhakti Articles