ఆర్తితో పిలిస్తే ఆదుకునే దేవుడు

ఆర్తితో పిలిస్తే ఆదుకునే దేవుడు
శ్రీశైలం ... పరమశివుడి లీలా విశేషాలకు వేదికగా నిలిచిన పరమపావన పుణ్యక్షేత్రం. ఎంతోమంది దేవతల రాకపోకలు జరుగుతున్నందు వలన ... మరెంతో మంది మహర్షులు తపస్సు చేసుకున్న కారణంగా ఈ క్షేత్రంలోని అడుగడుగూ ... అణువణువు పవిత్రతను ఆవిష్కరిస్తూ వుంటుంది. ఇక్కడి చల్లని గాలి ... సదాశివుడి శ్వాసలా తగులుతుంది. ఇక్కడి ప్రకృతి పరమశివుడి సేవకుడిగా ఆహ్వానం పలుకుతూ వుంటుంది.

అనేక మహిమలకు పుట్టినిల్లుగా అలరారుతోన్న ఈ క్షేత్రంలో, శివకుటుంబం ప్రత్యక్షంగా నివసిస్తూ ఉంటుందని చెబుతుంటారు. శివకుటుంబాన్ని దర్శించడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. అలాంటిది ఒకవైపున శక్తిపీఠంగా ... మరోవైపున జ్యోతిర్లింగంగా అలరారుతోన్న ఈ క్షేత్రంలో శివకుటుంబాన్ని దర్శించడం ఎంతటి పుణ్యప్రదమో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్షేత్రంలో నవబ్రహ్మల ఆలయాల వరుసలో గల కుమారస్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శిస్తుంటారు. గర్భాలయంలో స్వామివారు నెమలివాహనంతో సహా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ నెమలి తన ముక్కుతో పాముని పొడుస్తున్నట్టుగా మలచబడింది. ఈ కారణంగా ఇక్కడి స్వామిని దర్శించడం వలన శత్రువులపై విజయం కలుగుతుందనీ ... నాగదోషాలు నివారించబడతాయని చెప్పబడుతోంది.

ఆరుముఖాలతో ... పన్నెండు చేతులతో ఇక్కడి స్వామి వివిధ రకాల ఆయుధాలను కలిగివుంటాడు. దేవలోకాన్ని ఆక్రమించడానికి ... దేవతలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన ఎంతోమంది అసురులను కుమారస్వామి సంహరించాడు. ఆయన శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా ఈ ఆయుధాలు కనిపిస్తూ వుంటాయి. తల్లిదండ్రుల సన్నిధిలో కొలువుదీరినస్వామి, ఈ క్షేత్రానికి బయలుదేరినవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాడట. తన తల్లిదండ్రులను దర్శించి తన దగ్గరికి వచ్చిన భక్తులను చూసి సంతోషంతో పొంగిపోతుంటాడు.

ఆర్తితో పిలిస్తే ఈ స్వామి వెంటనే ఆదుకుంటాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఏ కోరికలను నెరవేర్చడం వలన తన భక్తులు ఇబ్బందుల్లో నుంచి బయటపడతారో, ఆ కోరికలను స్వామి తక్షణమే తీరుస్తుంటాడని చెబుతుంటారు. అందువలన ఇక్కడి వచ్చే భక్తులు విలాసవంతమైన జీవితానికి సంబంధించిన కోరికలు కాకుండా, అత్యవసరమైనవి మాత్రమే కోరుతూ వుండటం విశేషం.

More Bhakti Articles