శ్రీమంతులను చేసే రుద్రాక్ష జపం

శ్రీమంతులను చేసే రుద్రాక్ష జపం
జీవితంలో ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనే అందరూ ఆరాటపడుతుంటారు. అందుకోసం తాము ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లడానికి ఎన్ని కష్టాలనైనా భరిస్తుంటారు. కేవలం విలాసాలు అనుభవించడానికే డబ్బు సంపాదిస్తున్నారని అనుకోవడం నిజం కాకపోవచ్చు. అవసరాలు తీరాలన్నా ... ఆపదలనుంచి గట్టెక్కాలన్నా ... కొన్ని అవకాశాలను అందుకోవాలన్నా అందుకు డబ్బు ఎంతో అవసరం. అందుకే అందరూ దానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. దానిని సొంతం చేసుకోవడం కోసం ఎన్ని విధాలుగానో శ్రమిస్తుంటారు.

ఈ నేపథ్యంలో కొంతమంది ఎంతగా కష్టపడుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంటుంది. అలాంటివాళ్లు ఐశ్వర్యవంతులు కావడానికి ఆధ్యాత్మికపరమైన మార్గాలను కూడా అన్వేషించవలసి వుంటుంది. రుద్రాక్షమాలతో జపం చేసేవాళ్లు ఐశ్వర్యవంతులు అవుతారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రుద్రాక్షలు ... వాటికి గల ముఖాలను బట్టి వివిధ రకాల విశిష్టతలను కలిగి ఉంటాయి. అలాంటి రుద్రాక్షలతో చేసే జపం విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది.

ఒక్కో ప్రయోజనాన్ని బట్టి, జపమాలలో రుద్రాక్షల సంఖ్య నిర్ణయించబడి వుంటుంది. ఆశించే ప్రయోజనాన్ని బట్టి అందుకు తగిన సంఖ్యలో రుద్రాక్షలు ఉపయోగిస్తుంటారు. అలా శ్రీమంతులు కావాలని కోరుకునేవాళ్లు 30 రుద్రాక్షలు కలిగిన జపమాలతో జపం చేయాలని శాస్త్రం చెబుతోంది. జపమాలను మెడలో ధరించకూడదు ... అలాగే ఎప్పుడు జపం చేసుకోవాడానికి ముందుగా ఆ జపమాలను ఆవుపాలతో శుద్ధిచేసి, ఆ తరువాతే జపం చేసుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ జపం చేసినట్లయితే, అనతికాలంలోనే సిరిసంపదలు పలకరిస్తాయని చెప్పబడుతోంది.

More Bhakti Articles