అడిగిమరీ ప్రతిష్ఠ చేయించుకున్న స్వామి

అడిగిమరీ ప్రతిష్ఠ చేయించుకున్న స్వామి
ప్రతి గ్రామస్తులు తమ గ్రామంలో ఏదో ఒక దేవుడిగుడి కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో రామాలయం ... మరో గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపిస్తుంటాయి. ఒక్కోసారి రాముడు విగ్రహాన్ని చెక్కబోతే అది కృష్ణుడి రూపాన్ని సంతరించుకోవడం, అలాగే కృష్ణుడి రూపాన్ని మలచడానికి ప్రయత్నిస్తే అది వేంకటేశ్వరస్వామిగా మారిపోవడం జరుగుతుంటుంది.

అది దైవమహిమగా భావించిన ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని అదే విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతూ వుంటుంది. అలాంటి చిత్రమైన సంఘటన ఒకటి మనకి 'ఉల్లిపాలెం' గ్రామంలో కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఒక భక్తుడు ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించడం కోసం కృష్ణుడి విగ్రహాన్ని తయారుచేయిస్తాడు. మరికొంత మంది భక్తులు అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పట్టుబడతారు. ఇరువర్గాల మధ్య ఈ వివాదం కారణంగా ప్రతిష్ఠా కార్యక్రమం ఆగిపోతుంది. ఈ విధంగా ప్రతిష్ఠ ఆగిపోవడం వెనుక ఏదో పరమార్థం వుందని ఆ ఊరు జమీందారుకి అనిపిస్తుంది.

అనుకున్నట్టుగానే ఆ రాత్రి ఆయనకి కలలో చెన్నకేశవస్వామి కనిపిస్తాడు. అల్లపర్రు గ్రామంలో తాను ఆశ్రయం లేకుండా ఉన్నాననీ ... తనని ఉల్లిపాలెంలో సిద్ధంగా ఉన్న గుడిలో ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు. తాము ఒకటి అనుకుంటే దైవం ఒకటి నిర్ణయించిందనే విషయం అప్పుడు జమీందారుకి అర్థమవుతుంది. మరునాడు ఉదయమే ఆయన తన కల గురించి గ్రామస్తులకి చెబుతాడు. చెన్నకేశవుడి అభీష్టంమేరకే ఇక్కడ జరగవలసిన ప్రతిష్ఠ ఆగిపోయిందని వాళ్లు విశ్వసిస్తారు. స్వామివారి ఆదేశం మేరకు ఆ ఊరు జమీందారు నడచుకోవడానికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తారు.

అలా కృష్ణుడి కోసం అనుకున్న ఆలయంలో చెన్నకేశవస్వామి ప్రతిష్ఠించబడ్డాడు. ఆ తరువాత అదే ప్రాంగణంలో కృష్ణుడినీ ... శివుడిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. స్వయంభువుగా అల్లపర్రులో బయటపడిన చెన్నకేశవస్వామి, అడిగిమరీ ఉల్లిపాలెం ఆలయంలో కొలువుదీరిన కారణంగా ఇది మహిమాన్వితమైన ప్రదేశంగా భక్తులు భావిస్తుంటారు. ఆ స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు.

More Bhakti Articles