రక్తగుండం అనే పేరు ఇలా వచ్చిందట !

రక్తగుండం అనే పేరు ఇలా వచ్చిందట !
రక్తగుండం అనే పేరు వినగానే మనసులో అలజడి మొదలవుతుంది ... ఆందోళన కలుగుతుంది. అసలు ఈ రక్తగుండం ఎక్కడవుందో ... దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. 'అహోబిలం' క్షేత్రాన్ని దర్శించిన భక్తులు, రక్తగుండం పేరు వినేవుంటారు ... చూసికూడా వుంటారు. నృసింహస్వామి ఆవిర్భవించిన శక్తిమంతమైన క్షేత్రాల్లో అహోబిలానికి గల ప్రత్యేకత ... విశిష్టత అంతా ఇంతా కాదు.

ఇక్కడే నృసింహస్వామి ఆవిర్భవించాడనీ ... హిరణ్యకశిపుడిని సంహరించాడని స్థలపురాణం చెబుతోంది. అందుకు నిదర్శనంగా ఇక్కడ కొన్ని ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుంటాయి. అలాంటి ఆనవాళ్లలో ఒకటిగా రక్తగుండం దర్శనమిస్తూ వుంటుంది. ప్రహ్లాదుడిని హింసించడంలోను ... శ్రీహరిని దూషించడంలోను హిరణ్యకశిపుడి ధోరణి శృతిమించిపోతుంది. దాంతో నృసింహస్వామి ఆవిర్భవించి, హిరణ్యకశిపుడిని సంహరించాడు.

ఆనాటి ఘట్టానికి గుర్తుగా ప్రస్తుతం ఈ ప్రదేశంలో జ్వాలానృసింహస్వామి ఆలయం కనిపిస్తూ వుంటుంది. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం, రక్తంతో తడిసిన తన చేతులను స్వామి ఇక్కడికి దగ్గరలో గల గుండంలో కడిగేసుకున్నాడట. స్వామివారు రక్తంతో తడసిన చేతులను కడగడం వలన ఈ గుండానికి రక్తగుండం అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. ఆనాటి సంఘటనకు ఈ గుండం సాక్ష్యం మాత్రమేనని అనుకుంటే పొరపాటే, ఇప్పటికీ ఈ గుండంలోని నీరు రక్తవర్ణంలో వుండటం విశేషం.

More Bhakti Articles