మనసున్న మల్లికార్జునస్వామి క్షేత్రం

మనసున్న మల్లికార్జునస్వామి క్షేత్రం
పరమశివుడి మనసు వెన్నకన్నా సున్నితమైనది ... మంచుకన్నా చల్లనైనది. భక్తుడి నుంచి ధన .. కనక .. వస్తు వాహనాలేవీ ఆయన ఆశించడు. పవిత్రమైన జలంతో అభిషేకిస్తే చాలు ... పదిజన్మలకు సరిపడా పుణ్యఫలాలను ప్రసాదిస్తాడు. ఆయనని సేవించాలనే ఆరాటం భక్తులలో ఎంతగా వుంటుందో, వాళ్లని అనుగ్రహించాలనే తాపత్రయం ఆదిదేవుడిలోను అంతగానే వుంటుంది.

అలాంటి మహాదేవుడు ఆవిర్భవించిన పుణ్యక్షేత్రాల్లో 'జొన్నవాడ' ఒకటిగా కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా పరిధిలో ... పెన్నానది తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ క్షేత్రంలో స్వామివారు మల్లికార్జునుడు పేరుతోను ... అమ్మవారు కామాక్షి పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. అమ్మవారి మూలమూర్తి కూడా స్వయంభువు అనీ ... పెన్నానదిలో జాలరులకు దొరికిందని చరిత్ర చెబుతోంది.

ఎంతోమంది భక్తులు ఈ తల్లిని తమ ఇంటి ఆడపడచుగా భావిస్తూ ... సేవిస్తూ వుంటారు. అత్యంత పవిత్రమైన ఈ నేలపై చేసిన యజ్ఞయాగాదులు తక్షణ ఫలితాలను ఇస్తాయనే ఉద్దేశంతో ఎంతోమంది మహర్షులు ... మహారాజులు ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ స్వామిని దర్శించి సేవించిన రాజులు, ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా కృషిచేశారు. ఎత్తయిన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... ప్రాకార మంటపాలు ... అద్భుతమైన శిల్పకళను ఆవిష్కరించే ముఖమంటపాలు ... మరింతగా ఆధ్యాత్మిక భావాలను మేల్కొల్పుతాయి.

మనసున్న ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ దేవదేవుడిని కోరే కోరిక ధర్మబద్ధమైనదే అయితే అది అనతికాలంలోనే నెరవేరుతుందని భక్తులు చెబుతుంటారు. కార్తీక మాసంలోను ... మహాశివరాత్రి సందర్భంలోనూ ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ... సేవలు చూసితీరవలసిందే.

More Bhakti Articles