సకల శుభాలను అందించే అరుదైన ఆలయం

సకల శుభాలను అందించే అరుదైన ఆలయం
లోకంలో త్రిశక్తి మాతలుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి పూజలు అందుకుంటూ వుంటారు. ఈ ముగ్గురూ వివిధ రూపాలలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి భక్తుల అనుగ్రహిస్తుంటారు. తన పాతివ్రత్య మహాత్మ్యం ఎలాంటిదో త్రిశక్తి మాతలకు చూపించి, వారిని ఆశ్చర్యచకితులను చేసిన ఓ పతివ్రతా శిరోమణి కూడా ఒక క్షేత్రంలో కొలువుదీరి భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటోంది. ఆ పతివ్రతామతల్లే అనసూయాదేవి ... ఆ క్షేత్రమే 'చిత్రకూటం'.

సీత ... సావిత్రి ... అరుంధతి ... సుమతి ... సుకన్య ... రేణుక వంటి మహా పతివ్రతలు ఎందరో ఉన్నప్పటికీ, ఒక్క రేణుకాదేవికి మాత్రమే పెద్ద సంఖ్యలో ఆలయాలు కనిపిస్తుంటాయి. ఇక అనసూయాదేవి విషయానికి వస్తే పూర్వం ఆమె తన భర్త అత్రి మహర్షికి సేవలు చేస్తూ ఇక్కడి ఆశ్రమంలో నివసించింది. అందువలన ఈ ప్రదేశంలో అనసూయాదేవి ఆలయం నిర్మించబడినట్టు స్థలపురాణం చెబుతోంది.

పూర్వం ఈ ఆలయం చిత్రకూటానికి కాస్త దూరంగా వుందనిపించినా, ఇప్పుడది చిత్రకూటంలో ఓ భాగంగా కలిసిపోయి కనిపిస్తుంది. సాధారణంగా చిత్రకూటం అనగానే వనవాస కాలంలో సీతారాములు ఎక్కువకాలం గడిపిన ప్రదేశంగా చెప్పుకుంటూ వుంటారు. ఈ ప్రదేశాన్ని ... ఇక్కడి వచ్చే యాత్రికులను పవిత్రం చేస్తోన్న 'మందాకిని' నదిని అనసూయాదేవియే సృష్టించినట్టుగా చెబుతుంటారు. త్రిమూర్తులు ఆమె ఒడిలో పసిబిడ్డలుగా మారిపోయింది ఇక్కడే!

ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరవుకాటకాలు ఏర్పడినప్పుడు, తన పాతివ్రత్య మహిమచే అనసూయాదేవి వర్షాలు కురిపించి సస్యశ్యామలం చేసింది. ఇలా అనసూయాదేవిని గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ వినిపిస్తూ వుంటాయి. అనసూయదేవిని మహిళా భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. అనసూయమాత ఆశీస్సుల కారణంగా దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని భక్తులు భావిస్తుంటారు. సంతాన భాగ్యం కలుగుతుందనీ ... సౌభాగ్యం సుస్థిరమవుతుందని విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles