ఈ గుళ్లోని రూపాలు దేవుడు మలచినవే !

ఈ గుళ్లోని రూపాలు దేవుడు మలచినవే !
పూరీ జగన్నాథస్వామి ఆలయ విశేషాలను పరిశీలిస్తే, సాక్షాత్తు ఆ జగన్నాథుడే శిల్పిగా వచ్చి అక్కడి విగ్రహాలను చెక్కినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అలాగే సాక్షాత్తు శ్రీరాముడు శిల్పిగా వచ్చి ఓ ప్రదేశంలో విగ్రహాలను మలిచిన తీరు మనకి మరోచోట కనిపిస్తుంది. పవిత్రమైన ఆ ప్రదేశమే 'ఇల్లంతకుంట' ... ఇది కరీంనగర్ జిల్లాలో విలసిల్లుతోంది. ఈ ప్రదేశంతో శ్రీరామచంద్రుడికి విడదీయరాని అనుబంధం వుంది. ఆ అనుబంధం కారణంగానే ఆయన ఇక్కడ ఆవిర్భవించాడనే విషయం స్పష్టమవుతూ వుంటుంది.

వనవాసానికి బయలుదేరిన సీతారామలక్ష్మణులు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. ఆ సమయంలోనే దశరథుడి మరణవార్త వారికి తెలుస్తుంది. దాంతో శ్రీరాముడు ఇక్కడే తన తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వహించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగా ఈ ప్రదేశాన్ని శ్రీరాముడు మరిచిపోలేకపోతాడు. తరువాత కాలంలో ఓ భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చి, ఫలానా శిలపై సీతారామలక్ష్మణుల రూపాలను చెక్కించి ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు.

ఆ భక్తుడు మంచి శిల్పి కోసం అన్వేషిస్తూ వుండగా, తానే శిల్పి రూపంలో వచ్చి పరిచయం చేసుకుంటాడు. విగ్రహాలను మలిచే సమయంలో తాను అన్నపానియాలు ముట్టననీ, తాను బయటికి వచ్చేంత వరకూ ఎవరూ లోపలికి రాకూడదంటూ చుట్టూ తెరలు కడతాడు. అప్పుడు మొదలైన 'ఉలి' శబ్దం ... కొన్ని రోజులకు ఆగిపోతుంది. అయినా ఆ శిల్పి బయటి రాకపోవడంతో, ఆ భక్తుడే లోపలికి వెళతాడు.

అక్కడ అద్భుతంగా మలచబడిన విగ్రహాలే తప్ప శిల్పాచార్యుడు మాత్రం కనిపించడు. శిల్పాచార్యుడి రూపంలో వచ్చినది సాక్షాత్తు శ్రీరామచంద్రుడేననే విషయం అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. అలా నిర్మించబడిన ఈ ఆలయం నేడు అశేష భక్తజన సందోహంతో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది. స్వామివారే స్వయంగా విగ్రహాలను మలిచారనే మహిమాన్వితమైన సంఘటనను సొంతం చేసుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.

More Bhakti Articles