నిమిషంలో కరుణించేది ఈ అమ్మవారే !

నిమిషంలో కరుణించేది ఈ అమ్మవారే !
స్వామివారి అనుగ్రహంకన్నా అమ్మవారి కరుణ తొందరగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువలన తాము ఆశిస్తోన్న వరాలను పొందడం కోసం అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ వుంటారు. కష్టాల నుంచి తమని గట్టెక్కించి సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని కోరుతుంటారు. అమ్మవారి మనసు వెన్నవంటిది కనుక, ఆమె వెంటనే కరిగిపోయి అడిగిన వరాలను అనుగ్రహిస్తుంది.

అలా భక్తుల కోరికలను త్వరగా తీర్చేసే అమ్మవారు మనకి కర్ణాటకలో కనిపిస్తుంది. ఇక్కడే ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం అలరారుతోంది. అమ్మవారు నిమిషంలోనే అనుగ్రహిస్తుందని చెప్పేసి ఆ తల్లిని 'నిమిషాంబ'గా కొలుస్తుంటారు. జగాలనేలే తల్లి ఇక్కడ ఈ పేరుతో ఆవిర్భవించడం వెనుక, లోక కల్యాణానికి సంబంధించిన కారణమే కనిపిస్తుంది.

పూర్వం గౌతమ మహర్షి 'పుండరీక యాగం' తలపెట్టగా దానిని అడ్డుకోవడానికి అసురులు ప్రయత్నించసాగారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అమ్మవారిని ప్రార్ధించగా నిమిషంలోనే అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమైందట. యాగభంగానికి పాల్పడుతున్న అసురులను సంహరించి, గౌతమ మహర్షి అభ్యర్థనపై ఇక్కడ కొలువై ఉండటానికి అంగీకరించింది. ఆనాటి నుంచి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటూ ... భక్తులను అనుగ్రహిస్తూ వస్తోంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటుంది. గర్భాలయంలో అమ్మవారు ప్రసన్నమూర్తిగా కళకళలాడుతూ కనిపిస్తుంది. శుక్రవారం రోజున అమ్మవారిని దర్శించే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విశేషమైనటువంటి పర్వదినాల్లో అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ తల్లిని పూజించడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు లభిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles