అరుదైన హనుమంతుడు ఇక్కడే కనిపిస్తాడు

అరుదైన హనుమంతుడు ఇక్కడే కనిపిస్తాడు
హనుమంతుడిని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు. హనుమంతుడు ఆకాశంలో ఎగరగలడు ... తనకి కావలసినది ఏదైనా సాధించుకుని తీసుకురాగలడు అనే విషయాలను పెద్దల ద్వారా తెలుసుకున్న పిల్లలు సహజంగానే ఆయనని ఎంతగానో అభిమానిస్తూ వుంటారు. ఈ కారణంగానే హనుమంతుడి విగ్రహం ఎక్కడ ఎంత పెద్దదిగా వున్నా పిల్లలు భయపడరు. పైగా ఆయన రూపాన్ని ఆసక్తిగా పరిశీలిస్తారు ... తమకి ఆయన అండగా ఉంటాడని ఆశిస్తారు.

ఇక గ్రహ పీడల నుంచి ... దుష్ట శక్తుల బారి నుంచి బయటపడాలంటే హనుమంతుడి అనుగ్రహం సంపూర్ణంగా కావాలని పెద్దలు ఆయనని ఆరాధిస్తూ వుంటారు. ఇలా అందరి మనసులు దోచుకున్న హనుమంతుడు ఎక్కడ చూసినా కుడిచేతిలో 'గద' పట్టుకుని దర్శనమిస్తూ ఉంటాడు. అందుకు భిన్నంగా ఎడమ చేతిలో గద పట్టుకున్న హనుమంతుడు మనకి 'నైనితాల్' లో కనిపిస్తాడు. సతీదేవి రెండు కళ్లలో ఒకటి ఈ ప్రదేశంలో పడటం వలన, ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

ఎడమచేతిలో గద పట్టుకుని .. కుడి చేతితో అభయమును ఇస్తున్నట్టుగా ఈ క్షేత్రంలో హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. హనుమంతుడు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఎడమచేతితో గద పట్టుకున్నాడనీ, అలాంటి అరుదైన భంగిమలో ఆయన ఇక్కడ కొలువుదీరడమే విశేషమని స్థానికులు చెబుతుంటారు. ఈ శక్తి పీఠానికి చేరుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడి హనుమంతుడిని దర్శించుకుంటారు. ఆ స్వామికి ఇష్టమైన పూలను ... పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడి హనుమను దర్శించడం వలన ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

More Bhakti Articles