బాబా దర్శనమే బాధలను నివారిస్తుంది

బాబా దర్శనమే బాధలను నివారిస్తుంది
శిరిడీ సాయిబాబాకి మించిన వైద్యుడు లేడు ... ఆయన ప్రసాదంగా ఇచ్చే విభూతికి మించిన ఔషధం లేదని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఎంతోమంది భక్తులను వ్యాధుల బారి నుంచి కాపాడి, మృత్యుముఖం నుంచి వాళ్లని బాబా తప్పించడమే అందుకు కారణం. బాబా భక్తులుగా మారిన వాళ్లంతా ఆయన వలన ఆపదల నుంచి బయటపడిన వాళ్లే ... దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తుని పొందిన వాళ్లే.

అలాంటివారి జాబితాలో మనకి 'భీమాజీ పాటిల్' ఒకడుగా కనిపిస్తాడు. బాబా మశీదులో కూర్చుని భక్తులను అనుగ్రహించే రోజుల్లో, భీమాజీ పాటిల్ ని క్షయ వ్యాధి పట్టి పీడించసాగింది. ఆ వ్యాధి ఆయనని సతమతం చేయసాగింది. రోజు రోజుకీ తన పరిస్థితి దిగజారిపోతుండటాన్ని ఆయన గ్రహించాడు. అప్పటికే ఎంతోమంది వైద్యులు చూసి ఎన్నో రకాల మందులు ఇచ్చారు. అయినా అవి కాస్త కూడా ఆయనకి ఉపశమనం కలిగించలేకపోయాయి.

ఇక తనకి చావుతప్పదని ఆయన అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి నానాసాహెబ్ చందోర్కర్ తారసపడటం జరుగుతుంది. తన అనారోగ్యం గురించి ఆయన దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తాడు భీమాజీ. సాయిబాబా తప్ప ఆయనని ఎవరూ కాపాడలేరనీ, ఆయన దర్శనం చేసుకోమని చెబుతాడు చందోర్కర్. దాంతో ఆ మరునాడే భీమాజీ శిరిడీ బయలుదేరి వెళ్లి బాబాను కలుసుకుంటాడు.

తనని పట్టి పీడిస్తోన్న వ్యాధిని గురించి బాబాతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనకి గల బరువు బాధ్యతలను గురించి ప్రస్తావిస్తూ ఆవేదనను వ్యక్తం చేస్తాడు. గత జన్మలో చేసిన పాపమే వ్యాధి రూపంలో తనకి నరకం చూపిస్తోందనీ, అయినా పెద్ద మనసుతో మన్నించి తనని బతికించమంటూ ప్రాధేయపడతాడు. బాబా అని పిలిస్తేనే పలికే ఆయన భీమాజీ ఆవేదనకి మైనంలా కరిగిపోతాడు. తన పట్ల భీమాజికి గల విశ్వాసం ఆయనకి ఆనందాన్ని కలిగిస్తుంది.

తన పాదాలపై పడిన భీమాజిని ఆయన ఆప్యాయంగా పైకి లేవనెత్తుతాడు. ఇకపై ఏ వ్యాధి ఆయనని ఏమీ చేయలేదనీ ... తన సన్నిధిలో అడుగుపెట్టిన మరుక్షణమే ఆయన అనారోగ్యం తొలగిపోయిందని చెబుతాడు బాబా. అప్పటి వరకూ తనని పట్టి పీడిస్తోన్న వ్యాధి లక్షణాలు హఠాత్తుగా మాయమై పోవడాన్ని గమనించిన భీమాజీ ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. తనకి ఆరోగ్యాన్ని ... ఆయుష్షును ప్రసాదించిన బాబాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన పాదాలను కన్నీళ్లతో కడుగుతాడు. బాబా భక్తుడిగా మారిపోయి, అనునిత్యం బాబా సేవలోనే ఆనందంగా గడుపుతూ జీవించాడు.

More Bhakti Articles