ముసలితనాన్ని దూరంగా ఉంచే తీర్థం !

ముసలితనాన్ని దూరంగా ఉంచే తీర్థం !
భక్తులను తన దివ్యదర్శనం ద్వారా అనుగ్రహించడం కోసం భగవంతుడు అనేక పవిత్రమైన ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. జన్మజన్మల నుంచి వెంటవస్తోన్న పాపాల బారి నుంచి భక్తులను బయటపడేయడం కోసం దివ్యతీర్థాలను సృష్టించాడు. భగవంతుడి సంకల్పం కారణంగా ఆవిర్భవించిన తీర్థాలు కనుక, ఇవి ఎంతో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.

వీటిలో పాపాలను ... శాపాలను ... దోషాలను ... వ్యాధులను తొలగించే తీర్థాలు వున్నాయి. అలాగే ముసలితనాన్ని దూరంగా వుంచి, యవ్వనాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే తీర్థం కూడా మనకి ఈ జాబితాలో కనిపిస్తుంది. అదే ... 'కాయరసాయన తీర్థం' ... ఇది తిరుమల కొండపై సనకసనందన తీర్థం సమీపంలో దర్శనమిస్తుంది. తిరుమల కొండల పరిధిలో పాపనాశనం ... ఆకాశ గంగ ... చక్రతీర్థం ... శంఖుతీర్థం ... పాండవతీర్థం ... కుమారతీర్థం ... తుంబుర తీర్థం .. సనక సనందన తీర్థం ... ఇలా అనేక తీర్థాలు అలరారుతున్నాయి.

ఆరోగ్యాన్ని ఇచ్చేవి .. ఆయుష్షును పెంచేవి ... సంపదలను ప్రసాదించేవి ఈ తీర్థాలలో ఉన్నాయి. అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి .. ఆయుష్షును పెంచి వృద్ధాప్యాన్ని ఎక్కువకాలం దూరంగా ఉంచగల ప్రత్యేకతతో కాయరసాయన తీర్థం కనిపిస్తుంది. పూర్వం అనేక మంది మహర్షులు ... మునీశ్వరులు ... మహాభక్తులు ఈ తీర్థం సమీపంలో తపస్సు చేసుకున్నారు. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన ... అందులోని నీటిని స్వీకరించడం వలన దాని మహిమను గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

పురాణాలు కూడా ఈ తీర్థం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించడం జరిగింది. వివిధ కాలాల్లో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన రాజులు ... అధికారులు ఈ తీర్థం విశిష్టతను గురించి తెలుసుకుని దర్శించి, స్నానమాచరించి విముక్తులైనట్టు చెప్పబడుతోంది. కొంతకాలంపాటు వాళ్లు ఇక్కడే ఉంటూ స్నాన పానాలు ఆచరించడం వల్లనే ఈ తీర్థ ప్రభావం గురించి సంపూర్ణంగా తెలుసుకోగలిగారు. కాస్త కష్టమైనా తిరుమల కొండలపై గల పవిత్ర తీర్థాలను దర్శించాలనుకునే భక్తులు ఈ తీర్థం దగ్గరికి చేరుకోవచ్చు. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన ... ఈ నీటిని స్వీకరించడం వలన ఆయురారోగ్యాలను పొందవచ్చు.

More Bhakti Articles