నైవేద్యం పాత్రలు ఎలా ఉండాలి ?

నైవేద్యం పాత్రలు ఎలా ఉండాలి ?
భగవంతుడిని పదహారు రకాల ఉపచారాలతో సేవించమని శాస్త్రం చెబుతోంది. ఈ ఉపచారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించినప్పుడే, ఆయనకి సంతోషం ... భక్తులకు సంతృప్తి కలుగుతాయి. పదహారు రకాల ఉపచారాలలో 'నైవేద్యం' మరింత ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. దేవాలయాలలో భగవంతుడికి నైవేద్యంగా సమర్పించబడినదే భక్తులకు ప్రసాదంగా పంచబడుతూ ఉంటుంది.

అదే విధంగా పూజా మందిరాలలో భగవంతుడికి నైవేద్యంగా అర్పించబడినది కూడా ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దైవానికి ఫలాలు కానీ ... పాయసం వంటి పదార్థాలు గాని నైవేద్యం పెడుతుంటారు. ఇందుకోసం ఇంట్లోని రకరకాల పాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. పండ్ల విషయాన్ని పక్కన పెడితే ఎక్కువ వేడి ... కారం ... పులుపులేని పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి. ఇక వెండి ... ఇత్తడి వంటి పాత్రల్లోనే ఆ పదార్థాలను సమర్పించాలి.

ఇంట్లో వాడుకునే పాత్రలను భగవంతుడి నైవేద్యానికి ఉపయోగించకూడదు. అలాగే పరిశుభ్రంగా లేని పాత్రల్లోనూ పాత పాత్రలలోను ... పగిలిపోయిన పాత్రలలోను నైవేద్యాలు పెట్టకూడదు. ఈ విధంగా చేయడం వలన భగవంతుడి పట్ల నిర్లక్ష్య భావంతో వ్యవహరించినట్టు ... ఆయనని అవమానపరిచినట్టు అవుతుంది. ఫలితంగా పుణ్యానికి బదులుగా పాపం వారి ఖాతాలో చేరిపోతుంది.

అందువల్లనే భగవంతుడి నైవేద్య సమర్పణకు గాను ప్రత్యేక పాత్రలు తీసుకోవాలి. వాటిని పవిత్రమైన ప్రదేశంలో వేరుగా వుంచి, భగవంతుడి కోసమే వాడుతూ వుండాలి. శరీరాన్ని ... మనసును పరిశుద్ధం చేసుకుని, పవిత్రమైన భావంతో చేసిన నైవేద్యాన్ని ... పరిశుభ్రమైన ప్రత్యేక పాత్రలో సమర్పించినప్పుడే భగవంతుడు దానిని ఆస్వాదిస్తాడు ... అనుగ్రహిస్తాడు.

More Bhakti Articles