ఈ వేంకటేశ్వరస్వామిని దర్శిస్తే చాలు !

ఈ వేంకటేశ్వరస్వామిని దర్శిస్తే చాలు !
మనకోసం వైకుంఠం నుంచి దిగివచ్చిన స్వామి కోసం మనం కొంచెం దూరం నడిచి కొండను ఎక్కలేమా ? అనుకుంటూ భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ వుంటారు. బరువైన ఆభరణాలతో ఉండటంకన్నా భక్తుల హృదయాలలో ఉండటానికే స్వామి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన విషయంలో ఏ మాత్రం అలసత్వాన్ని ప్రదర్శించినా అమ్మవారు సహించదు. అలాగే తన దర్శనం తరువాత భక్తులు అమ్మవారిని పూజించడం స్వామికి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది.

అలా స్వామివారు ... అమ్మవారు అనేక ప్రదేశాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో నిర్మించబడిన ఆలయం మనకి రంగారెడ్డి జిల్లా 'అలియాబాద్' లో కనిపిస్తుంది. వేంకటేశ్వరస్వామి ఉద్యానవనాలను ఎక్కువగా ఇష్టపడతాడు. ఇక ఆయన కోసం తరలివచ్చే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అందువలన ఇక్కడ స్వామివారు ఉండటానికి సువిశాలమైన ప్రదేశంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి, భక్తుల తాకిడిని తట్టుకునేలా భారీ నిర్మాణంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది.

తిరుమలలో స్వామివారి గర్భాలయాన్ని 'ఆనందనిలయం' గా పిలుస్తారు. ఇక్కడి ఆలయాన్ని మొత్తాన్ని కలిపి 'రత్నాలయం' గా పిలుస్తారు. చూడగానే ఖరీదైన కట్టడంగా కనిపించే ఈ ఆలయంలో స్వామివారు గర్భాలయం నిండుగా ... నిలువెత్తున దర్శనమిస్తుంటాడు. మనోహరమైన ఆయన రూపాన్ని మనసులో దాచుకోవాలేగానీ, మాటల్లో వర్ణించడం కష్టం. స్వామి వారి గర్భాలయానికి ఇరువపులా గల ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు దర్శనమిస్తుంటారు.

విశేషమైన పర్వదినాల్లో ఘనంగా జరిపే ఉత్సవాలు స్వామివారి వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. స్వామివారికి ఏడాది పొడవునా ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ విధంగా కళ్యాణోత్సవాలు జరిపించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles