దృష్టి భగవంతుడిపై మాత్రమే వుండాలి

దృష్టి భగవంతుడిపై మాత్రమే వుండాలి
పూజ చేసేటప్పుడు మనసు ... దృష్టి భగవంతుడిపై మాత్రమే వుండాలి. ఎదురుగా భగవంతుడు ప్రత్యక్షంగా కూర్చుని ఉన్నాడనీ, ఆయనని నేరుగా సేవిస్తున్నామని భావించాలి. దేవుడిని ఒక విగ్రహంగా మాత్రమే చూస్తూ, ఇతర వ్యాపకాలలో జోక్యం చేసుకుంటూ చేసే పూజ వలన ఆశించిన ఫలితం లభించదు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన గురించి చెప్పుకోవచ్చు.

ఒకసారి అక్కల్ కోట మహారాజ్ తన భక్తుడి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళతాడు. ఆ సమయంలో ఆ కుటుంబ సభ్యులు పూజ చేసుకుంటూ వుంటారు. యజమాని స్వామిని ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చి మర్యాద పూర్వకంగా లోపలి తీసుకువెళతాడు. ఆ కుటుంబసభ్యులు చేస్తోన్న పూజను ఓ కంట గమనిస్తూనే మరో వైపున యజమానితో స్వామి మాట్లాడుతూ ఉంటాడు.

పూజా మందిరంలోకి ప్రవేశించిన ఎలుక ఒకటి అక్కడి చిత్రపటాల వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. పూజలో కూర్చున్న వాళ్లంతా ఆ పటాలను పక్కకి జరుపుతూ ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఫలితంగా పూజా మందిరంలో గల దీపారాధన కుందులు పడిపోవడం ... నూనె ఒలికిపోవడం ... నైవేద్యం కిందపడిపోవడం ... సామాన్లు చెల్లా చెదురుకావడం జరుగుతుంది. ఆ దృశ్యాన్ని చూసి స్వామి తనలో తాను నవ్వుకుంటాడు.

చివరికి ఆ పూజా మందిరంలో నుంచి పారిపోతున్న ఎలుకను వాళ్లు కొట్టి చంపుతారు. ఆ ఎలుకను తన చేతుల్లోకి తీసుకుని, దాని కోసం అంత గందరగోళం చేయడం అవసరమా ? అని వాళ్లని అడుగుతాడు స్వామి. పూజ సమయంలో దృష్టి భగవంతుడిపై మాత్రమే ఉండాలనీ, అలా వుంటే వాళ్లకి ఆ ఎలుక కనిపించి వుండేది కాదని అంటాడు. భగవంతుడిపై కాకుండా ఎలుకపై దృష్టి పెట్టడం వల్లనే అంతటి గందరగోళం జరిగిందని చెబుతాడు. ఆ ఎలుక ఎలా వచ్చిందో .. అలాగే పోయేదనీ, దానిని పట్టుకునే ప్రయత్నంలో అపచారానికి పాల్పడ్డారని అంటాడు.

పూజ వలన పుణ్యం లభించాలనీ, అయితే వాళ్లకి ఆ పూజ మీద సరైన దృష్టి లేని కారణంగా పాపం చేయవలసి వచ్చిందని చెబుతాడు. ప్రశాంతంగా పూజ చేసుకునే వాళ్లకి, ఎలుకను వెంటాడి చంపే ఆవేశం ఉండకూడదని అంటాడు. చిన్న చిన్న అంతరాయాలను కూడా సహనంతో భరించలేని వాళ్లు, భగవంతుడి సమీపానికి ఎలాంటి పరిస్థితుల్లోను వెళ్లలేరని స్పష్టం చేస్తాడు. తన చేతిలో వున్న ఎలుకను ప్రేమతో మూడు మార్లు నిమిరి దానిని కింద వదులుతాడు. చనిపోయిన ఆ ఎలుక అంతకు ముందులాగే గంతులేస్తూ అక్కడి నుంచి పరిగెడుతుంది. యజమానితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ మన్నించమంటూ స్వామి పాదాలపై పడతారు.

More Bhakti Articles