ఓ భక్త కన్నప్పే కాదు ఓ రామదాసు కూడా !

ఓ భక్త కన్నప్పే కాదు  ఓ రామదాసు కూడా !
అడవిలో జంతువులను వేటాడి ఆకలి తీర్చుకోవడం మాత్రమే తెలిసిన 'తిన్నడు' ... అసమానమైన భక్తి విశ్వాసాలతో సదాశివుడిని సేవించాడు. స్వామి కోసం తన కన్నులను పెకిలించుకుని 'కన్నప్ప' గా చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే తన కన్నులను పెకిలించుకుని స్వామికి సమర్పించిన మరో భక్తుడే 'విరూపణ్ణ'.

భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆలయాన్ని నిర్మించడం కోసం, ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మును ఖర్చు చేసి గోపన్న శిక్షను అనుభవిస్తాడు. అలాగే విరూపణ్ణ ... లేపాక్షిలో స్వామివారికి ఆలయాన్ని ... కళ్యాణ మంటపాన్ని నిర్మించాలని అనుకుంటాడు. అందుకు సంబంధించిన పనులు చకచకా ప్రారంభమవుతాయి. నిర్మాణపు పనులు మధ్యలో ఉండగానే విరూపణ్ణ దగ్గరున్న ధనం అయిపోతుంది.

అచ్యుతదేవరాయలవారి ఆస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ, ప్రభుత్వ ఖజానాలో నుంచి మిగతా ధనాన్ని ఖర్చు చేయడం మొదలుపెడతాడు. ఈ విషయం అచ్యుతదేవరాయలవారికి తెలిసిపోతుంది. తనకి చెప్పకుండా ప్రభుత్వ ఖజానాలోని సొమ్మును విరూపణ్ణ ఉపయోగించడంపట్ల ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఈ నేరానికి పాల్పడినందుకుగాను విరూపణ్ణ కనుగుడ్లను పెకిలించమని తన సేవకులను ఆజ్ఞాపిస్తాడు.

రాజ భటుల కంటే ముందుగానే ఈ వార్త విరూపణ్ణను చేరుతుంది. అప్పటికి ఆయన తలపెట్టిన నిర్మాణాలు మధ్యలోనే వుంటాయి. విరూపణ్ణ ఆ నిర్మాణాలను ఒకసారి మనసారా చూసుకుంటాడు. ఆ శిల్పాలను ఆప్యాయంగా తనివితీరా తడుముతాడు. ఆ తరువాత తన కనుగుడ్లను తానే పెకిలించుకుని వాటిని శివయ్యకి సమర్పిస్తాడు. అయితే తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని అచ్యుత దేవరాయలు వెనక్కి తీసుకుంటాడు. రాజభటులను కూడా ఆయన వెనక్కి పిలిపిస్తాడు.

అయితే ఈ లోగా విరూపణ్ణ తన కనుగుడ్లను పెకిలించుకున్నాడని తెలిసి మహారాజు నుంచి సాధారణ పౌరుల వరకూ అంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. అలా విరూపణ్ణలో ఓ భక్త కన్నప్పే కాదు ... ఓ రామదాసు కూడా కనిపిస్తూ వుంటాడు. మహాదేవుడి పై విరూపణ్ణకి గల అసమానమైన భక్తికి నిదర్శనంగా ... ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేటికీ ఆ నిర్మాణాలు ఇక్కడ అసంపూర్తిగా కనిపిస్తుంటాయి. మనసున్న ప్రతి ఒక్కరికీ అనంతమైన ఆవేదనను కలిగిస్తూనే వుంటాయి.

More Bhakti Articles