గురువును అవమానిస్తే కలిగే ఫలితం ?

గురువును అవమానిస్తే కలిగే ఫలితం ?
గొర్రెల కాపరిగా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ వస్తోన్న 'కాలుడు', అమ్మవారి అనుగ్రహంతో అపారమైన జ్ఞాన సంపదను సొంతం చేసుకుని 'కాళిదాసు'గా మారిపోతాడు. ఆయన రచించిన కావ్యాలు ఒకదానికి మించి ఒకటి మహారాజుల ప్రశంసలు అందుకోవడంతో, మహాకవిగా ఆయన కీర్తి ప్రతిష్ఠలు దశదిశలా వ్యాపిస్తాయి.

కాళిదాసు తమ రాజ్యానికి వస్తే తమ అదృష్టంగా రాజులు భావిస్తూ ఉండేవాళ్లు. ఆయన కావ్యభాష సాధారణ ప్రజలకు అర్థంకాకపోయినా, ఒకసారి ఆయనని చూస్తేచాలని అనుకునేవాళ్లు. ఇక తాము రాసిన కావ్యాలను ఒకసారి కాళిదాసుకి వినిపించడం వలన, వాటికి సార్థకత లభిస్తుందని మిగతా పండితులు భావిస్తూ వుండేవాళ్లు.

ఈ కారణంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది కవిపండితులు ఆయనని కలుసుకోవడానికి వస్తుంటారు. కాళిదాసుని కలుసుకుని ఆయన రచనా శైలిని గురించి ... పద ప్రయోగాల గురించి ... భావ సంపదను గురించి పొగడ్తలు గుప్పించసాగారు. పండితులతో మాట్లాడుతూ, వాళ్ల ప్రశంసలకు పొంగిపోతూ ఓ ప్రదేశానికి చేరుకుంటాడు కాళిదాసు. అక్కడ వ్యాస మహర్షి శిలాప్రతిమ వుంటుంది.

ఆ విగ్రహం యొక్క తీరును గురించి హాస్యంగా మాట్లాడుతూ, ఆ విగ్రహానికి గల బొడ్డులో వేలుపెడతాడు కాళిదాసు. అంతే ఆ వేలు అలాగే బిగుసుకుపోతుంది. కాళిదాసు బాధపడిపోతూ ఉండటం చూసి మిగతా వాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకిలా జరిగిందో అర్థంకాక అయోమయాన్ని వ్యక్తం చేస్తారు. వాళ్ల ప్రశంసలకు తనని తాను మరిచిపోయి గురువును అవమానపరిచాననీ, అందువల్లనే తనని ఆయన ఈ విధంగా శిక్షించాడని చెబుతాడు కాళిదాసు.

ఇక మీదట పొగడ్తలకు దూరంగా ఉంటాననీ, తాను చేసిన తప్పును పెద్దమనసుతో మన్నించమని వ్యాస భగవానుడిని కోరతాడు కాళిదాసు. దాంతో ఆ విగ్రహం బొడ్డులో నుంచి ఆయన వేలు బయటికి వస్తుంది. కాళిదాసు ఎదురుగా వ్యాసమహర్షి ప్రత్యక్షమవుతాడు. పాండిత్యమనేది పరమాత్ముడి వరప్రసాదమనీ, ఇతరులను అవమానపరచడానికీ, అపహాస్యం చేయడానికి దానిని ఉపయోగించడం మంచిదికాదని చెప్పి అదృశ్యమవుతాడు. ఆనాటి నుంచి కాళిదాసు పొగడ్తలను దగ్గరికి చేరనీయకుండా, పండిత లోకానికి ఆదర్శప్రాయమై నిలిచాడు.

More Bhakti Articles