కష్టాలు దూరంచేసే కోనేరు

కష్టాలు దూరంచేసే కోనేరు
పుణ్యక్షేత్రాలను దర్శించిన వాళ్లు అక్కడి కోనేరులో ముందుగా స్నానంచేసి, ఆ తరువాత ఆలయ ప్రవేశం చేస్తుంటారు. సాధారణంగా ప్రతి క్షేత్రంలోను అక్కడ గల కోనేరు ఏదో ఒక ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆ కోనేరు ఆవిర్భవించిన తీరు ... అందులో స్నానం చేయడం వలన ... తీర్థంగా తీసుకున్నందు వలన కలిగే ఫలితాలు ఆ కోనేరు మహిమాన్వితమైనదనే విషయాన్ని చెబుతుంటాయి.

ఈ నేపథ్యంలో కొన్ని కోనేర్లలలో స్నానం చేయడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయనీ ... మరికొన్ని కోనేర్లలో స్నానం చేయడం వలన మోక్షం లభిస్తుందని స్థలపురాణం చెబుతుంటుంది. అలాగే ప్రకాశం జిల్లా 'మడనూరు' క్షేత్రంలోని కోనేరు కూడా పురాణ నేపథ్యాన్ని కలిగి కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ 'రామలింగేశ్వరుడు' పేరుతో ప్రసిద్ధి చెందింది.

ఇక ఇక్కడ కోనేరు ఆవిర్భవించిన తీరులోకి వెళితే, పరమశివుడు తన త్రిశూలాన్ని భూమిపై గుచ్చడం వలన ఇక్కడ జలధార పుట్టిందని చెబుతారు. పూర్వం ఇక్కడి రామలింగేశ్వరుడిని అభిషేకించడానికి పూజారి చాలాదూరం వెళ్లి అభిషేక జలాన్ని తీసుకుని వచ్చేవాడట. మహాభక్తుడైన ఆ పూజారి వయసైపోయిన కారణంగా, ఒకరోజున అభిషేకజలం కోసం అంతదూరం వెళ్లలేక సొమ్మసిల్లి పడిపోయాడు. కరుణా సముద్రుడైన శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్ష్యమయ్యాడు.

పూజారిని మామూలు స్థితికి తీసుకువచ్చి, ఇక పై అభిషేక జలం కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేదని చెబుతూ, తన త్రిశూలాన్ని నేలపై పొడవగానే అక్కడి నుంచి జలధార పొంగుకొచ్చి కోనేరు ఏర్పడింది. అలా పరమశివుడి త్రిశూలం నుంచి పుట్టిన ఈ కోనేరు, పూజారి కష్టాలనే కాదు భక్తులందరి కష్టాలను కడిగేస్తుంది.

ఈ కోనేరులోని నీటిని తలపై చల్లుకున్నవారిని కష్టాలు సమీపించలేవని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అందుకు ఎన్నో నిదర్శనాలు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. అందువల్లనే స్థానికులంతా ఇది మహిమాన్వితమైన కోనేరుగా భావిస్తుంటారు. కష్టాలను దూరం చేసే ఈ కోనేరును అపురూపంగా చూసుకుంటూ,అత్యంత భక్తి శ్రద్ధలతో అనునిత్యం పూజిస్తుంటారు.

More Bhakti Articles