భక్తులకు అండగా నిలిచే భగవంతుడు

భక్తులకు అండగా నిలిచే భగవంతుడు
శ్రీవారిని అన్నమయ్య అనేక సంకీర్తనలతో కొలుస్తూ ... తరిస్తూ వుండటం గురించి పెనుగొండ మహారాజు సాళ్వ నరసింహరాయలకి తెలుస్తుంది. కొత్తగా వివాహం చేసుకున్న ఆయన, భార్య ముచ్చట తీర్చడం కోసం అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించి సన్మానిస్తాడు. ఆ సమయంలో పద్మావతీ శ్రీనివాసుల గురించి అన్నమయ్య పాడిన సంకీర్తన ఆ రాజ దంపతుల మనసు దోచుకుంటుంది.

పద్మావతీ శ్రీనివాసులపై ఆయన అల్లిన శృంగార కీర్తనల వంటివి తమపై కూడా రచించి గానం చేయమని వాళ్లు అన్నమయ్యను కోరతారు. పరమాత్ముడిని కీర్తించిన నోటితో సాధారణ మానవులను కీర్తించనని అన్నమయ్య నిరాకరిస్తాడు. ఆయన ఆవిధంగా మాట్లాడటం సాళ్వ నరసింహరాయలు అవమానంగా భావిస్తాడు. తన ఆదేశాన్ని ధిక్కరించడం వలన తగిన ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తాడు.

శిక్ష ఏదైనా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నమయ్య అనడంతో, ఆయనని గొలుసులతో బంధించి హింసించమని మంత్రిని ఆదేశిస్తాడు. దాంతో వాళ్లు రాజాజ్ఞను తూ.చ.తప్పక పాటిస్తారు. సాళ్వ నరసింహరాయలని స్తుతిస్తూ కీర్తనలు రాయడానికి అంగీకరించమంటూ హింసిస్తుంటారు. ఆ బాధను తట్టుకోలేకపోయిన అన్నమయ్య, తన పరిస్థితిని స్వామికి మనవి చేసుకుంటాడు.

అంతే అన్నమయ్యను బంధించిన సంకెళ్లు ఒక్కసారిగా తెగిపోతాయి. ఆయన శరీరంపై గాయాలన్నీ క్షణాల్లో మాయమైపోతాయి. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన నరసింహరాయలు ఆశ్చర్యపోతాడు. అహంకారంతో ... అజ్ఞానంతో వ్యవహరించినందుకు తనని మన్నించమంటూ ప్రాధేయపడతాడు. తన పాపాన్ని ప్రక్షాళన చేయడం కోసం శిష్యుడిగా స్వీకరించమని కోరతాడు. అందుకు నిరాకరించిన అన్నమయ్య, ప్రజారంజకంగా పరిపాలిస్తూ హరిసేవలో తరించమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.

More Bhakti Articles