తగిన శాస్తి చేసే భగవంతుడు

తగిన శాస్తి చేసే భగవంతుడు
అహంకారం మానవత్వాన్ని మరుగున పడేస్తుంది ... దైవానికి సమీపంగా వెళ్లే అవకాశం లేకుండా చేస్తుంది. తమ మాటే నెగ్గాలని మంచివారిని బాధించే అహంకారవంతులకు భగవంతుడు తగినశాస్తి చేస్తూనే ఉంటాడు. సక్కుబాయి జీవితాన్ని పరిశీలిస్తే, ఆమె అత్తా ఆడపడుచుకు పట్టిన గతి ఇదే విషయాన్ని నిరూపిస్తుంది.

తన భక్తురాలైన సక్కుబాయిని 'పండరీపురం' పంపించి, ఆమె స్థానంలో ... ఆమె రూపంలో ఆ ఇంట్లో ఉంటాడు శ్రీ కృష్ణుడు. ఈ విషయం ఇటు సక్కుబాయికే కాదు ... అటు ఆమె అత్తా ఆడపడచులకు కూడా తెలియదు. తమ కళ్ల ఎదురుగా వున్నది సక్కుబాయేనని భావించిన అత్తా - ఆడపడచు ఇద్దరూ కూడా, ఎప్పటిలానే సక్కుబాయిని వేధించసాగారు.

ఇందులో భాగంగా ఒకరోజున సక్కుబాయిపై చేయిచేసుకోబోయిన ఆమె అత్తగారికి కాలు .. చేయి పడిపోతాయి. ఆ విషయంగా సక్కుబాయిని నానామాటలు అన్నందుకుగాను, ఆమె ఆడపడుచు నోరు పడిపోతుంది. దాంతో సక్కుబాయి దగ్గర ఏదో మంత్రశక్తి వుందని వాళ్లు భయపడిపోసాగారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన పట్ల సక్కుబాయి భర్త సంతోషిస్తాడు. భక్తురాలైన తన భార్య పట్ల వాళ్లు ప్రవర్తించిన తీరుకి భగవంతుడు తగినశాస్తి చేశాడని అనుకుంటాడు.

అయితే భగవంతుడి దయ వలన త్వరలోనే మామూలు స్థితికి వస్తారని వాళ్లకి సక్కుబాయి ధైర్యం చెబుతుంది. అసలు సక్కుబాయి తిరిగి వస్తే ఇబ్బంది పడుతుందని భావించిన మాయా కృష్ణుడు, ఆమె విషయంలో అత్తా - ఆడపడచుల మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. తాము ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ కూడా మరిచిపోయి, తమని సక్కుబాయి మంచిగా చూసుకుంటూ ఉండటంతో వాళ్లలో కొంత మార్పువస్తుంది. సక్కుబాయి మనసుకి కష్టం కలిగేలా వ్యవహరించినదుకు వాళ్లు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తారు.

More Bhakti Articles