విశిష్ట క్షేత్రంలో విలక్షణ మూర్తులు

విశిష్ట క్షేత్రంలో విలక్షణ మూర్తులు
త్రిమూర్తులు మొదలు దేవతలందరూ తాము ధరించిన ఆయుధాల కారణంగా ... అధిరోహించే వాహనాల కారణంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటారు. అలాంటి దేవతలు అందుకు భిన్నంగా ఏదైనా క్షేత్రంలో దర్శనమిస్తే ఆశ్చర్యపోవడం జరుగుతుంటుంది. అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే విశిష్ట క్షేత్రం చిత్తూరు జిల్లాలోని 'సురుటుపల్లి'లో అలరారుతోంది.

ఈ క్షేత్రంలో ఒక దైవం కాదు అనేక దేవతా మూర్తులు విలక్షణంగా కనిపిస్తూ, ఇది మహిమాన్వితమైన క్షేత్రమనే విషయాన్ని గుర్తుచేస్తూ వుంటాయి. క్షీరసాగర మథనంలో వెలువడిన విషాన్ని స్వీకరించి, ఆ విష ప్రభావాన్ని తట్టుకోలేక కొంతసేపు పార్వతీదేవి ఒడిలో సొమ్మసిల్లి పడిపోయిన పరమశివుడు ఈ క్షేత్రంలో దర్శనమిస్తాడు. ఈ సమయంలోనే దేవతలంతా ఇక్కడికి వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.

కృతయుగం నుంచి అత్యంత పవిత్రమైనదిగా ... శక్తిమంతమైనదిగా వెలుగొందుతోన్న ఈ క్షేత్రంలో, పార్వతీదేవి స్వామివారికి ఎడమవైపున కాకుండా కుడివైపున కనిపిస్తుంది. సాధారణంగా సింహం వాహనంపై త్రిశూలాన్ని ధరించి కనిపించే దుర్గాదేవి, ఇక్కడ వాహనం లేకుండా ప్రశాంత వదనంతో కనిపిస్తుంది. ఇక ప్రతి చోటా చెరుకుగడలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ కనిపించే రాజరాజేశ్వరీదేవి, ఇక్కడ బాణం ... విల్లంబులతో రౌద్రమూర్తిగా దర్శనమిస్తుంది. సరస్వతీదేవి వీణ లేకుండా కేవలం గ్రంధాలు చేతబట్టుకుని కనిపించడం మరో విశేషం.

ఎక్కడ చూసినా ఒంటరిగా కనిపించే 'దక్షిణామూర్తి' ఈ క్షేత్రంలో సతీసమేతంగా కొలువుదీరి ఉంటాడు. అలాగే ఎక్కడా లేని విధంగా సుబ్రహ్మణ్యస్వామి ఈ క్షేత్రంలో దక్షినాభిముఖంగా కొలువై వుండటం, అయ్యప్పస్వామి పులి వాహనం కాకుండా గజవాహనాన్ని అధిరోహించడం ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇలా దేవతలు మిగతా క్షేత్రాలకి భిన్నంగా ఇక్కడ కొలువై వుండటం వెనుక వివిధ రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి. వాటన్నిటి సారాంశం ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదనే విషయాన్నే స్పష్టం చేస్తుంటుంది.

More Bhakti Articles