సుఖశాంతుల నొసగే అమ్మవారు

సుఖశాంతుల నొసగే అమ్మవారు
లోక కల్యాణం కోసం వివిధ సందర్భాల్లో అమ్మవారు అనేక రూపాలను ధరించింది. ఒక్కో రూపాన్ని పూజిస్తూ వుండటం వలన, ఒక్కో ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తూ వస్తోంది. అమ్మవారు ధరించిన రూపాలలో తమ మనసు దోచుకున్న రూపాలను ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకుని భక్తులు ఆరాధిస్తూ వస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా 'కల్వకుర్తి' లోని శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం ఈ నేపథ్యంలో నిర్మించబడినదే.

అయితే మిగతా అమ్మవారి ఆలయాలకి పూర్తి భిన్నంగా ఇక్కడి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో గర్భాలయంలో వాసవీకన్యకాపరమేశ్వరి నుంచుని దర్శనమిస్తూ కనిపిస్తుంది. కానీ ఈ ఆలయంలో అమ్మవారు 'శయనమూర్తి' గా కనిపిస్తుంది. శయన భంగిమలో కొలువై కనిపించడమే ఇక్కడి అమ్మవారి విశిష్టతగా చెబుతుంటారు. చక్కగా తీర్చిదిద్దినట్టుగా కనిపించే ఈ ఆలయం, పవిత్రతకు ప్రతీకగా అలరారుతూ వుంటుంది. అనునిత్యం ఈ ఆలయంలో కుంకుమ పూజలు ... పారాయణాలు జరుగుతూ వుంటాయి.

ఇక ఇదే ప్రాంగణంలో నగరేశ్వరస్వామి కూడా తన భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇంకా గణపతితో పాటు లక్ష్మీనారాయణులు ... దాసాంజనేయ స్వామి ... సరస్వతీదేవి పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన సుఖసంతోషాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. తమకి ఎలాంటి లోటూ రానీయని అమ్మవారికి తాము ఏ లోటూ లేకుండా చూసుకుంటూ వుంటారు.

More Bhakti Articles