భక్తులను శిక్షిస్తే భగవంతుడు సహిస్తాడా?

భక్తులను శిక్షిస్తే భగవంతుడు సహిస్తాడా?
శ్రీ భాగవతాన్ని బలవంతంగా పోతన ఇంటి నుంచి తీసుకురావడానికి వెళ్లిన వాళ్లంతా, అక్కడ ఏదో శక్తి తమని అడ్డుకుంటోందంటూ ఉత్తచేతులతో తిరిగిరావడం సింగభూపాలుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. దాంతో తనకి భాగవతాన్ని అంకితం చేయడానికి నిరాకరించిన పోతనకు తన రాజ్యంలో స్థానం లేదనీ, ఆయనకి రాజ్య బహిష్కరణ శిక్షను విధించి భాగవతాన్ని తీసుకురమ్మని సైన్యాధిపతిని పంపిస్తాడు.

గ్రామస్తుల సమక్షంలో రాజాజ్ఞ పత్రాన్ని సైన్యాధిపతి చదివి వినిపిస్తాడు. రాజును అవమానపరిచిన కారణంగా, పోతనకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించబడినట్టు తెలియజేస్తాడు. ఉన్నపళంగా భార్యా బిడ్డలను తీసుకుని వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు. మహాభక్తుడైన పోతనకు అలాంటి పరిస్థితి వచ్చినందుకు గ్రామస్తులందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. రాజు ఆదేశం విన్న పోతన ఇంట్లోకి కూడా వెళ్లకుండా కట్టుబట్టలతో అక్కడి నుంచి బయలుదేరుతాడు.

పూజా మందిరంలో వున్న భాగవతాన్ని ఆ రాముడే రక్షించుకుంటాడని ఆయన భావిస్తాడు. పోతన కుటుంబ సభ్యులు అలా వెళ్లగానే రాజభటులు ఆయన ఇంట్లోకి ప్రవేశిస్తారు. భాగవతం కోసం వెదికిన వాళ్లకి అది పూజా మందిరంలో కనిపిస్తుంది. అయితే పూజా మందిరంలోకి ప్రవేశించడానికి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంటుంది.

మూర్ఖత్వంతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించి సైన్యాధిపతి తీవ్రంగా గాయపడతాడు. భాగవతం విషయంలో అప్పటి వరకూ తమకి అందిన సమాచారం నిజమేనని గ్రహిస్తాడు. రాజుగారిని కలుసుకుని తన ప్రత్యక్ష అనుభవం గురించి వివరిస్తాడు. ఏదో అదృశ్య శక్తి ఆ గ్రంధాన్ని కాపాడుతోందని చెబుతాడు. దాంతో ఆ తరువాత చేయవలసిన పని గురించి రాజుగారు ఆలోచనలో పడతాడు.

More Bhakti Articles