శని దోషాలు హరించే క్షేత్రం

శని దోషాలు హరించే క్షేత్రం
ఎవరైనా సరే జీవితం అందంగా .. ఆనందంగా ... హాయిగా సాగిపోవాలని కోరుకుంటారు. ఆ దిశగా తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే అనుకోని ఆటంకాలు నిరాశపరుస్తుంటాయి ... ఇష్టాలు తీరకుండా ఇబ్బందులు పెడుతుంటాయి. కారణమేమిటో తెలియక కంగారుపడిపోయి, శాస్త్రం తెలిసిన వారిని సంప్రదిస్తే 'శనిదోషం' వుందనే విషయం బయటపడుతుంటుంది.

ఇక శని దోషం ఉందనగానే మనసు ఆందోళనతో నిండిపోతుంది. సాధ్యమైనంత త్వరగా దానిబారి నుంచి బయటపడాలనే ఆరాటం మొదలవుతుంది. శనిదేవుడు కొలువుదీరిన క్షేత్రాలను దర్శించి శాంతి చేయించడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో గల 'మాందాపురం' క్షేత్రం అందరినీ ఆకర్షిస్తూ వుంటుంది. శనిదోషాల నుంచి విముక్తి కలిగించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి శనిదేవుడు భక్తులకు అందుబాటులో ఆరుబయటే కొలువై కనిపిస్తుంటాడు. ఇక్కడి స్వామి చాలా తొందరగా మెత్తబడి తనని శరణు కోరిన భక్తులను వెంటనే అనుగ్రహిస్తూ ఉంటాడని అంటారు. ప్రతి శనివారం వేలసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించి స్వయంగా తైలాభిషేకం చేస్తుంటారు. మిగతా శని క్షేత్రాల మాదిరిగానే ఇక్కడ నల్లని వస్త్రాలు ధరించి పురుషులు మాత్రమే అభిషేక కార్యక్రమంలో పాల్గొంటూ వుంటారు. అష్ట దిక్పాలకులు వాహనాలతో సహా కొలువుదీరి వుండటం ఈ క్షేత్ర విశిష్టతగా చెబుతుంటారు.

ఇక్కడికి సమీపంలో గల కొండపై ప్రాచీనకాలం నాటి శివాలయం దర్శనమిస్తూ వుంటుంది. శివుడు లింగరూపంలోను ... ధ్యానమూర్తిగాను దర్శనమిస్తూ వుండటం ఇక్కడి ప్రత్యేకతగా కనిపిస్తూ వుంటుంది. ప్రత్యేక మందిరంలో పార్వతీదేవి పూజలు అందుకుంటూ వుండగా, వీరభద్రుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ కనిపిస్తాడు. ఈ ప్రాంతాన్ని దర్శించిన భక్తులు ఇటు శని అనుగ్రహం ... అటు శివానుగ్రహం పొందుతూ, వాళ్ల కృపా కటాక్షాలతో ఇబ్బందుల నుంచి ఇట్టే బయటపడిపోతుంటారు.

More Bhakti Articles