వ్యాధులు తొలగించే అభిషేక జలం

వ్యాధులు తొలగించే అభిషేక జలం
కొండపై కుమారస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలలో, ఆరు క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. వాటిలో తమిళనాడు ప్రాంతానికి చెందిన 'పళని' మూడవ స్థానంలో నిలుస్తోంది. దాదాపు 450 అడుగుల ఎత్తు ... 700 మెట్లు కలిగిన ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని స్థల పురాణం చెబుతోంది. సాధారణంగా చాలా క్షేత్రాల్లో అభిషేక జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తూ వుంటారు. ఈ తీర్థ జలం వలన అనారోగ్యాలు తొలగిపోతాయని చెబుతుంటారు.

అయితే 'పళని' క్షేత్రంలో ఇచ్చే తీర్థం వలన అనేక వ్యాధులు నశిస్తాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఇక్కడి తీర్థం మహిమాన్వితమైనదని అనడానికి గల కారణాలను కూడా వాళ్లు వివరిస్తుంటారు. ఈ క్షేత్రంలోని కుమారస్వామి ప్రతిమను 'సిద్ధభోగి' అనే శిల్పాచార్యుడు మలిచాడు. తొమ్మిది రకాల పాషాణాలను ... అనేకరకాల మూలికలతో తయారుచేయబడిన మైనం వంటి పదార్థాన్ని ఉపయోగించి స్వామివారి విగ్రహాన్ని రూపొందించాడని అంటారు. ఆ తరువాత ఆపక్కనే గల గుహలోకి వెళ్లిన సిద్ధభోగి తిరిగి బయటికి రాలేదట.

కాబట్టి సాక్షాత్తు దైవాంశ సంభూతుడే ఈ విగ్రహాన్ని మలిచినట్టు చెబుతారు. విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన ఔషధాల వలన ... స్వామి మహిమ కారణంగా అభిషేక జలాలకి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడిందని చెబుతుంటారు. ఈ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరించిన వారిలో చాలామందికి చర్మ సంబంధమైన వ్యాధులు ... శ్వాస సంబంధమైన వ్యాధులు నివారించబడినట్టుగా ఆధారాలు వున్నాయి. ఈ విశ్వాసం కారణంగానే ఈ క్షేత్రాన్ని దర్శించే ప్రతి ఒక్కరూ, అభిషేక జలాన్ని తమతో పాటు తీసుకు వెళుతుంటారు. అమృతంలా భావించి తమ కుటుంబసభ్యులకు అందజేస్తూ వుంటారు.

More Bhakti Articles