ఎండిపోయిన చెట్టు చిగురిస్తుందా ?

ఎండిపోయిన చెట్టు చిగురిస్తుందా ?
శ్రీ రాఘవేంద్రస్వామి వారు తన శిష్య బృందంతో కలిసి అనేక ప్రాంతాలను దర్శించసాగాడు. ఈ నేపథ్యంలో ఆయన ఓ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి బ్రాహ్మణులంతా ఆయనని రహస్యంగా కలుసుకుంటారు. వాళ్ల ధోరణిపట్ల స్వామి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ గ్రామ పెద్ద యజ్ఞయాగాదులు వంటివి చేయనీయడనీ, వాటివలన ప్రయోజనం లేదని ఆయన భావిస్తూ ఉంటాడని అంటారు. కనిపించని దైవం లేనట్టేగదా ... అలాంటప్పుడు ఆయన ఎలా వచ్చి సాయం చేస్తాడని వాదిస్తూ ఉంటాడని చెబుతారు.

ఈ విషయంలో ఆయనని ఎదిరించడం వలన ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో సతమతమైపోతున్నామని అంటారు. దాంతో శ్రీ రాఘవేంద్రస్వామి ఆ గ్రామ పెద్దతో మాట్లాడాలని అనుకుంటాడు. తన శిష్య బృందంతో కలిసి ఆయన ఇంటికి వెళతాడు. తాను వచ్చిన పని గురించి ఆ గ్రామపెద్దతో చెబుతాడు. ఎక్కడో ఉన్నాడనే దేవుడినీ, ఆయన పేరుచెప్పుకుని తిరిగే వాళ్లని తాను నమ్మనని అ గ్రామ పెద్ద నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు.

దైవారాధన ఫలితం ... యజ్ఞయాగాదులు నిర్వహించడం వలన కలిగే ప్రయోజనం గురించి స్వామి ఎంతగా చెప్పినా ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోడు. పైగా అంతకాలంగా దైవాన్ని పూజిస్తోన్న వాళ్లకి ఎంతో కొంత శక్తి ఉండాలనీ, ఆ శక్తే గనుక వుంటే మోడుగా మారిపోయిన చెట్టును చిగురింపజేయమని అక్కడే వున్న చెట్టును చూపిస్తాడు. ఆ మోడు చిగురిస్తే యజ్ఞయాగాదులకు తాను అనుమతిస్తానని చెబుతాడు.

ఈ లోగా గ్రామస్తులందరూ అక్కడికి చేరుకుంటారు. స్వామికి ఆ గ్రామపెద్ద పెట్టిన పరీక్ష అందరినీ అయోమయానికి గురిచేస్తుంది. ఎండిపోయిన చెట్టు ఎక్కడైనా చిగురిస్తుందా ? అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. రాఘవేంద్ర స్వామి ఆ మోడు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తన కమండలంలోని నీరును దానిపై చల్లుతాడు. అలా ఆయన మూడు రోజులపాటు చేయగానే ఆ మోడు చిగురించి, పచ్చదనంతో కళకళలాడసాగింది.

అనూహ్యమైన ఈ సంఘటన గ్రామస్తులందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్వామితో వాదనకి దిగినందుకు పశ్చాత్తాపపడుతూ ఆ గ్రామపెద్ద అక్కడికి చేరుకుంటాడు. అహంకారంతో ప్రవర్తించినందుకు మన్నించమంటూ రాఘవేంద్రస్వామి పాదాలపై పడతాడు. ఆ గ్రామంలో దైవారాధనకు ... దైవ సంబంధమైన కార్యక్రమాలకు అనుమతినిస్తాడు.

More Bhakti Articles