లక్ష్మీదేవి నిత్య పూజలో ?

లక్ష్మీదేవి నిత్య పూజలో ?
ఏ కుటుంబం సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండాలన్నా ... ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. లక్ష్మీదేవి ప్రసాదించే సిరిసంపదలే అందరి జీవితాలను ఆనందమయం చేస్తుంటాయి. అందువలన అందరూ ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.

లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం కనుక, అమ్మవారికి ఆ రోజున అందరూ కుంకుమ పూజ చేస్తుంటారు. సిరిసంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుతుంటారు. ఈ నేపథ్యంలోనే చాలామందికి ఒక సందేహం వస్తూ వుంటుంది. లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా కుంకుమతో మాత్రమే పూజించాలేమోనని అనుకుంటూ వుంటారు. అయితే ప్రతి నిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలనే నియమమేదీ లేదు.

కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజగా మాత్రమే భావించాలి. నిత్య పూజకి సంబంధించిన విషయానికి వచ్చే సరికి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించాలి. తెలుపు ... పసుపు .. ఎరుపు రంగు పూలు అమ్మవారి పూజకి శ్రేష్ఠమైనవిగా చెప్పబడుతున్నాయి. అమ్మవారిని సంతోష పెట్టడంలోను ... భక్తులు సంతృప్తి చెందడంలోను పుష్పాల సేకరణ ప్రధాన పాత్రను పోషిస్తుంది.

అమ్మవారికి ఒక్కో రకం పుష్పాలు వాడటం వలన ఒక్కో ఫలితం కనిపిస్తుంది. ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో, అక్షింతలతో అమ్మవారిని సేవించాలని శాస్త్రం చెబుతోంది. అక్షింతలతో అమ్మవారిని పూజించడం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమోననే సందేహమే అవసరం లేదు. కనుక ఇంట్లోని పూజ మందిరంలో అమ్మవారి ప్రతిమను పుష్పాలతోను ... అక్షింతలతోను ఆరాధించవచ్చు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి మనసు గెలుచుకుని అష్టైశ్వర్యాలను పొందవచ్చు.

More Bhakti Articles