శయన హనుమంతుడు

శయన హనుమంతుడు

శయన హనుమంతుడు
హనుమంతుడు అనగానే అపారమైన పరాక్రమం ... అసమానమైన మేథస్సు ... విశ్వమంతటి వినయం గుర్తుకు వస్తాయి. భక్తుడు ఎలా ఉండాలో ... భగవంతుడు ఎలా ఉండాలో కూడా నిరూపించిన హనుమంతుడు, అనేక ప్రాంతాల్లో వివిధ నామాలతో ఆవిర్భవించాడు. భక్తాంజనేయుడుగా ... వీరాంజనేయుడుగా అభయాన్ని ప్రసాదిస్తూ వుండే స్వామి, ఎక్కడ చూసినా నుంచునే దర్శనమిస్తూ ఉంటాడు.

అందుకు పూర్తి భిన్నంగా స్వామి పడుకుని దర్శనమిచ్చే క్షేత్రం కూడా వుంది. ఆశ్చర్యచకితులను చేసే ఆ విశిష్టమైన క్షేత్రం, మహారాష్ట్రలోని 'ఖుల్తాబాద్' లో నెలకొని వుంది. 'భద్రమారుతి' పేరుతో పిలవబడే ఇక్కడి హనుమంతుడిని స్వయంభువుగా చెబుతుంటారు. పూర్వం శ్రీరాముడిని అమితంగా ఆరాధించే ఓ భక్తుడు, ఓ రోజున తనని తాను మరిచిపోయి భజన చేయసాగాడు.

ఆ భజన హృదయాన్ని తాకడంతో హనుమంతుడు వచ్చి అక్కడ నాట్యం చేసి అలసిపోయి పడుకున్నాడట. చాలా సేపటి తరువాత ఇది గమనించిన ఆ భక్తుడు, హనుమంతుడి పాదాలపై పడ్డాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన హనుమంతుడు, తనకి అమితానందం కలిగేలా శ్రీ రాముడి భజన చేసినందుకు వరం కోరుకోమని అడిగాడు. లోక కల్యాణం కోసం ఆయన అక్కడ ఆవిర్భవించవలసిందిగా ఆ భక్తుడు కోరడంతో స్వామి ఆ మనవిని మన్నించాడు.

ఈ కారణంగానే స్వామి ఇక్కడ శయన హనుమంతుడిగా దర్శనమిస్తుంటాడు. సువిశాలమైన ప్రదేశంలో అద్భుతమైన నగిషీలతో ఈ ఆలయం అలరారుతుంటుంది. ప్రాచీన కాలంనాటి ఇక్కడి స్వామిని ఎందరో రాజులు దర్శించి తరించినట్టు ఆధారాలు వున్నాయి. మహారాజుల నుంచి మామూలు భక్తుల వరకూ అందరూ ఇక్కడి స్వామి మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారే. ఇక్కడి హనుమంతుడిని పూజించిన వారికి సమస్యలన్నీ తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles