భక్త రక్షకుడు భగవంతుడు

భక్త రక్షకుడు భగవంతుడు
సర్వం శివమయమని తలచిన మంజునాథుడు నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ వుంటాడు. గతంలో తాను చేసిన శివనింద కారణంగా సంక్రమించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి 'కోటిలింగాలు' ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా అహర్నిశలు కృషి చేసి, ఓ యజ్ఞంలా ఆ పనిని పూర్తి చేస్తాడు. ఆ సందర్భంగా గ్రామస్తులందరికీ అన్నదానం చేయాలని అనుకుంటాడు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి. ఓ వైపున గ్రామస్తులకి భోజనం వడ్డిస్తూ వుండగా, మరోవైపున ప్రమాదవ శాత్తు మంజునాథుడి కుమారుడు మరణిస్తాడు. ఆ సమయంలో ఆ విషయం బయటికి చెప్పడం మంచిది కాదని భావించి మంజునాథ దంపతులు దుఃఖాన్ని దిగమింగుకుంటారు. అయితే ఆ తరువాత విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యపోతారు.

వాళ్లలో కొంతమంది ఆ దంపతుల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తారు. మరికొందరు తమకి మైల భోజనం పెట్టి అవమాన పరిచాడంటూ పంచాయితి పెడతారు. తాను చేసినది తప్పే అయితే అందుకు ఏ శిక్ష విధించినా తాను సిద్ధంగా వున్నానని పంచాయితి పెద్దలతో మంజునాథుడు చెబుతాడు. ఈ విషయం అంబికేశ్వర మహారాజుకి తెలుస్తుంది. వెంటనే ఆయన ఆ పంచాయితీని రద్దు చేయమంటూ కబురు చేస్తాడు. పంచాయితీ పెద్దలతో సహా అందరినీ తన దర్బార్ కి పిలిపిస్తాడు.

మంజునాథుడి వంటి మహాభక్తుడు ఆ గ్రామంలో జన్మించడం వాళ్లు చేసుకున్న పుణ్యంగా చెబుతాడు. ఉద్దేశ పూర్వకంగా మంజునాథుడిని ఇబ్బంది పెట్టడం మానుకుని, ఇకపై ఆయన చూపిన భక్తి మార్గంలో నడచుకుని జన్మను చరితార్థం చేసుకోమని చెబుతాడు. మంజునాథుడిని నిందించిన వాళ్లు తమ తప్పు తెలుసుకుని ఆయన పాదాలపై పడతారు. ఆధ్యాత్మిక మార్గంలోని ఆనందాన్ని అర్థం చేసుకుని ఆయన్ని అనుసరిస్తారు.

More Bhakti Articles