ఆదరించే అన్నపూర్ణమ్మ

ఆదరించే అన్నపూర్ణమ్మ
శ్రమ పేరుతో ఎవరు ఎన్ని రకాలుగా బాధలను భరిస్తున్నా ... కష్టాలను తట్టుకుంటున్నా అదంతా ఆకలి తీర్చుకోవడం కోసమే. ఆకలి తీర్చుకోవాలనే ఆలోచనే అందరిలో చైతన్యానికి కారణమవుతుంది. అయితే బలవంతులతో పోరాడి బలహీనులు ఆకలి తీర్చుకోలేని పరిస్థితి వుంటుంది. అలా బలవంతులను ఎదుర్కోలేక నిస్సహాయులై పస్తులుండే తన బిడ్డల ఆకలిని తీరుస్తూ వుంటుంది అన్నపూర్ణమ్మ.

అందుకే ఆకలి తీర్చిన ప్రతి ఇల్లాలిని అన్నపూర్ణమ్మగానే అందరూ భావిస్తూ వుంటారు. ఆ తల్లిని అనునిత్యం దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆలయాలు నిర్మిస్తూ వుంటారు. అలా నిర్మించబడిన అమ్మవారి ఆలయం హైదరాబాద్ - తాళ్లగడ్డలో దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. పూర్వం ఇక్కడి బావిలో అమ్మవారి విగ్రహం వుండటం చూసి గ్రామస్తులు బయటికి తీశారు.

ఈ విషయం తెలుసుకున్న అక్కన్న - మాదన్నలు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారు మహిమాన్వితమైనదని తలచి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. ఆ తరువాత అమ్మవారి సన్నిధిలో కాశీ విశ్వేశ్వరస్వామి ... గణపతి ... సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరారు. శివ కుటుంబాన్ని ఒకే ప్రాంగణంలో దర్శించుకోవడం వలన సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

గర్భాలయంలో అమ్మవారి ప్రతిమ పరిమాణం రీత్యా చిన్నదిగానే కనిపిస్తుంది. తలభాగం పెద్దదిగా కనిపించే ఈ అమ్మవారు చల్లని మనసున్న తల్లిగా భక్తులు చెబుతుంటారు. పాడిపంటలను కాపాడుతూ నిస్సహాయులకు ఆకలిబాధ లేకుండా చూస్తుందని అంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నపూర్ణమ్మ తల్లికి ... కాశీ విశ్వేశ్వరుడికి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల భక్తులు వచ్చి ఈ వేడుకను తిలకించి తరిస్తుంటారు.

More Bhakti Articles