పూజకు ముందు అల్పాహారం

పూజకు ముందు అల్పాహారం
ప్రతి మనసులో దేవుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో పూజామందిరం వుంటుంది. దైవం ఏ రూపంలో వున్నా ... ఏ నామంతో వున్నా పూజ అనేది ఉదయం తొమ్మిది గంటలలోపే పూర్తి చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే చాలామంది ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని పూజ పూర్తి చేస్తుంటారు. పూజ అయిన తరువాతనే అల్పాహారం వంటివి తీసుకుంటూ వుంటారు.

ఇక విశేషమైన పుణ్య తిథుల్లో ... నోములు .. వ్రతాల సమయంలో ఈ విషయంలో మరింత నిష్టగా వ్యవహరిస్తూ వుంటారు. సాధారణంగా శాస్త్రం సూచించినట్టు ప్రత్యేకమైన పూజలు ఉపవాస దీక్షను చేపట్టి చేస్తూ వుంటారు. అయితే ఇలాంటి పూజలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటూ వుంటాయి. దాంతో ఆకలికి ఆగలేని వాళ్లు కొందరు అల్పాహారాన్ని స్వీకరించి పూజలో కూర్చుంటూ వుంటారు.

అయితే విశేషమైన పూజల విషయంలో ఆ పూజ పూర్తయ్యేంత వరకూ ద్రవాహారం మినహా మరేది తీసుకోకూడదనే నియమం వుంది. అయితే అనారోగ్య కారణాల వలన గానీ, మరేదైనా కారణంగా గాని కొంతమంది ఖాళీ కడుపుతో తాము వుండలేమంటూ ఆహారం తీసుకుంటూ వుంటారు. కుటుంబంలో ఒక్కరు ఇలా చేసినా ఆ దోషం వెంటాడుతుందేమోనని మిగతా వాళ్లు దిగాలు పడిపోతుంటారు. పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా దక్కదేమోనని ఆందోళన చెందుతూ వుంటారు.

అయితే ఇలా ఆకలికి ఆగలేక అల్పాహారం తీసుకున్న వారు, తల స్నానం చేసి పూజలో కూర్చోవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన ఆహారం తీసుకున్న దోషం తొలగిపోతుందని అంటోంది. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ... ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ విధంగా చేయవచ్చని చెబుతోంది. లేదంటే అల్పాహారంతో పాటు దోషాన్ని కూడా స్వీకరించినట్టు అవుతుందని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles