పేదరికాన్ని వదిలించే నేరేళ్లమ్మ

పేదరికాన్ని వదిలించే నేరేళ్లమ్మ
ఆదిపరాశక్తియైన అమ్మవారు దుష్టులను శిక్షించడానికి ... తన బిడ్డలవంటి భక్తులను రక్షించడానికి అనేక అవతారాలను ధరించింది. అలాగే తనని నమ్మినవారి జీవనాధారమైన పాడిపంటలను కాపాడటానికి కూడా అమ్మవారు అనేక ప్రాంతాల్లో ... వివిధ రూపాల్లో అవతరించింది. అలా అమ్మవారు 'నేరేళ్లమ్మ' పేరుతో ఆవిర్భవించిన క్షేత్రం 'అన్నవరం' లో దర్శనమిస్తుంది.

సాధారణంగా అన్నవరం అనగానే రత్నగిరి పై కొలువుదీరిన 'శ్రీ సత్యనారాయణ స్వామి' గుర్తుకొస్తాడు. ఆ స్వామి కొండకు దిగువునే ఈ అమ్మవారి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వెలుగు చూడటానికి ముందు నుంచే అమ్మవారు గ్రామదేవతగా ఆవిర్భవించి పూజలు అందుకుంటోంది. ఈ కారణంగా ఇక్కడి ప్రజలు అమ్మవారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూ వుంటారు.

అమ్మవారి అనుగ్రహమే తమని చల్లగా కాపాడుతూ వుందని అందరూ బలంగా నమ్ముతుంటారు. తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా తొలి ఆహ్వానం ఆమెకే అందజేస్తూ వుంటారు. తొలి పాడిని ... తొలి పంటను అమ్మవారికి సమర్పిస్తూ వుంటారు. గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి భారీగా కనిపిస్తుంది. విశాలనేత్రాలతో ప్రేమానురాగాలను వర్షింపజేస్తూ వుంటుంది. వైశాఖ శుద్ధ అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తుంటారు.

ఇక్కడి అమ్మవారు తమ పాడిపంటలను సదా రక్షిస్తూ ఉంటుందనీ, తమ సంపదలను వృద్ధి చెందేలా చేస్తుందని స్థానికులు అంటారు. ఈ అమ్మవారిని నమ్ముకున్న వారు పేదరికాన్ని ఎరుగరని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అమ్మవారికి ఎలాంటి లోటూ రానీయకుండా ఆ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటూ వుంటారు.

More Bhakti Articles